ఢిల్లీలో విషాదరక ఘటన చోటుచేసుకుంది. తన పెళ్లి ఆహ్వాన పత్రికలను పంచేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి.. కారులో మంటలు చెలరేగడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఘాజీపూర్‌లోని బాబా బాంకెట్ హాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు కారులోనే మంటలు అంటుకోవడంతో చనిపోయాడు.
ఘటనాస్థలిలో కనిపిస్తున్న దృశ్యాలను బట్టి.. వేగనార్ కారు పూర్తిగా తగలబడిపోయింది. ముఖ్యంగా డ్రైవర్ సీటు పూర్తిగా కాలిపోయింది.
గ్రేటర్ నోయిడాలోని నవాడకు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 14న వివాహం జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు.
తన పెళ్లి ఆహ్వాన పత్రికలను పంచేందకు మధ్యాహ్నం వెళ్లాడని.. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చిందని మృతుడి సోదరుడు సుమిత్ తెలిపారు. రాత్రి 11-11.30 మధ్యలో పోలీసులు ఫోన్ చేసి.. యాక్సిడెంట్ అయిందని.. అనిల్ ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పారని తెలిపాడు.
ఇద్దరం కలిసి పనిచేసే వాళ్లమని బాధితుడి బావమరిది యోగేశ్ చెప్పారు. తన సోదరిని ఫిబ్రవరి 14న వివాహం చేసుకోవాల్సి ఉండగా.. ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కారుకి మంటలు ఎలా అంటుకున్నాయో తెలియడం లేదని అన్నారు.
అనిల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.