ఇంట్లో మనం చేసే ప్రతీ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా వాడుతుంటాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వారానికి ఒకసారి..ఇంట్లోనే తయారు చేసుకుని.. ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిజ్‌లో పెట్టి రోజు కొంచెం కొంచెం వాడుతుంటాం. అయితే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసేవారయితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకునే సమయం ఉండకపోవచ్చు. అలాంటి వారు మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే మీ కోసమే ఈ విషయం చెప్పాలి. ఒళ్లు గగుర్పొడిచే ఈ విషయం వింటే ఇంకెప్పుడూ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను బయట కొనాలంటే భయపడతారు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో దారుణాలు వెలుగుచూశాయి. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు బయటపడ్డాయి. కాళ్లకు షూస్ ధరించి తొక్కుతూ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తయారీకేంద్రంలో వారు ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదు. మిగిలిన పొట్టు, చెత్తను నాలాలోకి వదిలేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. తీవ్ర దుర్వాసన మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఎలాంటి అనుమతులు లేకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి అమ్మేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసి మనుషుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. చుట్టూ డబ్బాలు, చెత్తా చెదారం అంతా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్కడ వాడుతున్న డబ్బాలు, నీళ్లు, అన్నీ కలుషితంగా ఉన్నాయి. అటు అక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో , అపరిశుభ్ర పదార్థాలతో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని నీట్‌గా ప్యాక్ చేసి మరీ అమ్ముతున్నారు.
స్థానికులు ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదట. స్థానికులు సైతం దుర్బాసన రావడంతో అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదార్లు… ఈ సారి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కొనే ముందు ఆలోచించుకోవాలి.