ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో తుది ఫలితం వెలువడక ముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతూ కనిపించిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అప్పడు కొడాలి నాని వెళ్లిపోతున్న వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఆయన మీడియా కంట పడినట్టు పెద్దగా లేదనే చెప్పాలి. గత 8 నెలలుగా గుడివాడకు దూరంగానే ఉంటున్న నాని.. ఏదైనా పని ఉంటే తప్ప బయటకు రావడం లేదు. ఒకవేళ అవసరం పడి వచ్చినా చడీ చప్పుడు లేకుండా వచ్చి వెంటనే గాయబ్ అవుతున్నారు. వైసీపీ కార్యక్రమాల్లో కూడా ఆయన కనిపించడం లేదనే చెప్పాలి.
ఆయన స్నేహితుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అయ్యాక ఇక కొడాలి నాని వంతేనంటూ రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఈ గుసగుసలు నిజమే అన్నట్టుగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నాని అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమాచారం చేరవేయాలంటే తన అనుచరులకు కొడాలి నాని ఫోన్‌లో అందుబాటులో ఉండేవారట. ఇప్పుడు కనీసం ఫోన్ చేసి చెబుదామన్నా ఫోన్లన్నీ స్విచ్చాఫ్ వస్తున్నాయట. దీంతో ఇప్పుడు నాని ఎక్కడా?..అని ఆయన అనుచరులే వెతుక్కోవాల్సిన పరిస్థితి.
కొడాలి నాని.. వైసీపీ హయాంలో రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు. అప్పుడు.. ఆ తర్వాత కూడా తనదైన శైలిలో టీడీపీపై విరుచుకుపడ్డారు. మామూలుగా కాదు.. కొన్ని సార్లు వినకూడని, అనకూడని, కనకూడని భాష కూడా వాడారాయన. అంతేకాదు.. జగన్ ఇచ్చిన అలుసు చూసుకుని నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా కూడా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయటకు తీసే పనిలో ఉందట. ఇప్పటికే కొడాలి నానిపై గుడివాడలో మూడు కేసులు నమోదయ్యాయి. మరోవైపు కూటమి సర్కార్ గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై దృష్టి పెట్టింది. దీని దర్యాప్తులోనూ కొడాలి నానిపై కేసు నమోదవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా కొడాలి నాని అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయాడట.