హైందవ సంస్కృతిలో ఆరాధ్యనీయభావం తప్ప అధికారదర్పం కానరాదు. దేవతారాధనతో పాటు ప్రకృతిలోని అణువణువును పూజిస్తాం. ఎందుకంటే ప్రకృతి మనకు సర్వం సమకూరుస్తుంది తప్ప, మన నుంచి ఏమీ ఆశించదు, తీసుకోదు. రాళ్లతో కొట్టినా చెట్లు పళ్లను ఇస్తాయి, తానందించిన ఒక్క ఫలాన్ని సైతం ఏ చెట్టు తినదు. జీవ నదులు పుష్కలంగా నీళ్లిస్తాయి, ఒక్క చుక్క నీటిని నదులు తాగవు. పరోపకారార్థ మిదం…అనే రీతిలో చెట్లు, నదులు, మూగజీవాలు..సర్వస్వాన్ని అర్పిస్తాయి. ప్రకృతి సంపదను పుష్కలంగా వినియోగించుకున్న మానవ సంఘం.. ఆ ప్రకృతికే చేటు వాటిల్లచేయడం చాలా బాధాకరం. ఇక నదుల విషయానికి వస్తే….దాహార్తి తీర్చడానికే కాక ఎన్నో రీతుల్లో సమస్త ప్రాణికోటికి నదులు ఉపయోగపడుతున్నాయి. నదీ స్నానం వల్ల పుణ్యఫలం లభిస్తుందని సర్వ పురాణాల చెబుతున్నాయి. అయితే, అతి పవిత్రమైన పన్నెండు పుణ్య నదుల్లో, ఒక్కో నదికి పండ్రెండు ఏళ్లకోసారి పుష్కరాలు నిర్వహిస్తారు. మరోవైపు ప్రతి పన్నెండేళ్లకు మహా కుంభమేళా నిర్వహిస్తారు. దక్షిణాదివాసులు పుష్కరాల వైభవానికి పెద్దపీట వేస్తుండగా, ఉత్తరాది వాసులు కుంభమేళాకు అగ్రస్థానం ఇస్తారు. అయితే, పుష్కరాల్లో, కుంభమేళాల్లో యావత్ దేశంలోని భక్తులు అందరూ పాల్గొంటారు, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ రెండూ పుణ్యనదీ స్నానాలే. అయితే, పుష్కరాల ప్రాశస్త్యం ఏమిటి, కుంభమేళా విశిష్టత ఏమటి..? ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి..?
మకర సంక్రమణ పర్వదినాల్లో తొలి పండుగైన భోగి పండుగ నాడు ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా ప్రారంభం అయ్యింది. 45 రోజులపాటు మహా కుంభమేళా జరగనుంది. భోగినాడు భక్తులు ప్రయాగ్ రాజ్ లో పెద్ద ఎత్తున కుంభమేళా స్నానాలు ఆచరించి కుంభమేళాకు శ్రీకారం చుట్టారు. నెలన్నర రోజుల్లో దాదాపు 40 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలుస్తోంది. హైందవ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు విశేష ప్రాధాన్యం ఉంది. కుంభమేళాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. అయితే, కుంభమేళా నిర్వహణకు పద్దతులు ఉంటాయి. ప్రతి నాలుగేళ్లకోసారి కుంభమేళా కార్యక్రమాలు నిర్వహించగా, అర్థ కుంభమేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్ రాజ్ లో నిర్వహిస్తారు. పూర్ణకుంభమేళా ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్ లో నిర్వహిస్తారు. 2013 లో ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా నిర్వహించగా, తిరిగి ఇప్పుడు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా పుణ్యనదీ స్నాన వేడుకను నిర్వహిస్తున్నారు.
సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభ సందర్భంలో, మకర సంక్రాంతి రోజు నుంచి మహా కుంభం ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి కుంభస్నానాలు మొదలవుతాయి. సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కుంభమేళా స్నానాన్ని శంకరభగవత్పాదులు ప్రారంభించినట్టు పురాణ చరిత్ర చెబుతోంది. ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యగణాలు, సాధుపుంగవుల పుణ్య స్నానాల కోసం తొలుత సంఘం ఒడ్డున ప్రత్యేక ఘాట్ లు ఏర్పాటు చేసినట్టు చరిత్ర తెలియజేస్తోంది. అనంతరం కాలంలో లక్షల సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర స్నానాలకు తరలిరావడం మొదలెట్టారు. మోక్ష సిద్ధికి ఇక్కడి పుణ్యనదీ స్నానం ఎంతో దోహదపడుతుందని పెద్దలు చెబుతున్నారు. స్వర్ణయుగంగా పేరొందిన గుప్తుల కాలంలో ఇది ఆరంభమైనట్టు కొందరు చరిత్రకారులు తమ పరిశోధనలద్వారా తెలియజేస్తున్నారు.
అమృత సాధన కోసం దేవ, దానవులు మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని క్షీర సాగర మథనం చేశారు. మంథర పర్వతం మునిగిపోకుండా కూర్మావతార రూపంలో శ్రీమహవిష్ణువు కాపాడగా, సాగరం నుంచి హాలాహలం ఉద్భవించినప్పుడు లోకాలన్నీ హాహా కారాలు ఎత్తిపోయాయి. దీంతో, దయాసాగరుడు, జగద్రక్షకుడు, సరళ హృదయుడైన పరమశివుడు ఆ హాలాహలన్ని కంఠం నడుమ ఉంచుకుని గరళ కంఠుడి పేరు పొందాడు. ఇక సాగర మథనంలో రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, మహలక్ష్మీ అమ్మవారు, చంద్రుడు జన్మించారు. అనేక సర్ప, పక్షి, జంతు జాతులు పుట్టుకొచ్చాయి. చివరగా అమృతభాండం దర్శనమిచ్చింది. అమృతం కోసం దేవ, దానవులు వాదులాడుకోగా.. శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో ముందుకొచ్చి ఈ సమస్య పరిష్కారానికి ఉద్యుక్తుడవుతాడు.
దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒక వైపు ఉండగా జగన్మోహిని రూపంలో శ్రీమన్నారాయణుడు..తొలుత దేవతల వరుస నుంచి అమృతం పంచడం మొదలెడతాడు. అయితే, ఇద్దరు రాక్షసులు దేవతల రూపంలో వచ్చి దేవతల వరుసలో కూర్చుంటారు. జగన్మోహిని పంచుతున్న అమృతభాండం నుంచి వెలువడిన అమృతధారలను ఆ రాక్షసులు సేవించి వికటాట్టహాసంతో తమ అసురరూపాలతో బయటకు వస్తారు. దీనిపై ఆగ్రహించిన శ్రీమహావిష్ణువు చక్రాయుధం ప్రయోగిస్తాడు. వారి తల మొండెం వేరవుతుంది. అమృత పానం వల్ల వారు శాశ్విత జీవితులుగా ఉంటారు. అయితే, సూర్యుడు, చంద్రుడు మధ్య వీరు కూర్చుని అమృతపానం కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. శ్రీహరికి, సూర్య చంద్రులు తమ మధ్య ఉన్న రాక్షసుల విషయం చెబుతారు. దీంతో, ఆ రాక్షసులు ఆగ్రహం చెంది సూర్యచంద్రులను పీడించడం మొదలెట్టారు. అమృత పానం చేసిన ఆ రాక్షసులే రాహు, కేతువులు. సూర్య, చంద్రులను మింగి వదిలేయడమే గ్రహణాలు. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రాహు, కేతువుల వల్లే ఏర్పడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
సాధించిన అమృతభాండాన్ని కాపాడడంలో చంద్రుడు, బృహస్పతి, సూర్యుడు, శనిదేవుడు ప్రధాన పాత్ర వహించడంతో…ఈ గ్రహాల కలయిక సమయంలో మహాకుంభం నిర్వహిస్తారని పురాణ ప్రముఖులు చెబతున్నారు. ఈ గ్రహాల కలయిక వేళే అమృత పాత్ర పరిరక్షించబడిందని, ఈ ఘట్టాలు పూర్తయ్యాక శ్రీ మహావిష్ణువు అనుజ్ఞతో మొత్తం దేవతాగణాలు అమృతాన్ని సేవించారనే కథనాలు ఉన్నాయి. మహా పుణ్యస్నానం, రాజస్నానంగా మహాకుంభ స్నానాన్ని పెద్దలు పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృత తుల్యం అవుతుందని విశ్వసించే చాలామంది భక్తులు ఇతర నదుల్లోనూ స్నానాలు చేసి దేవతారాధనలు చేస్తారు. మరో కథనం ప్రకారం అమృతాన్ని స్వర్గానికి తీసుకెళ్లే సమయంలో మహావిష్ణువు ధరణిపై నాలుగు పుణ్య తీర్ధాల్లో ఒక్కో చుక్క అమృతాన్ని విడిచాడు. ఆ నాలుగు తీర్ధాల్లో ప్రతీ 12 ఏళ్ల కోసారి కుంభమేళా జరుగుతూ వస్తోందని మరో కథనం. అ సమయంలో ఆయా తీర్ధాల్లోని జలం అమృతంగా మారుతుందని భక్తులు తెలిసికాని, తెలియకాని చేసిన పాపాలు తొలగించే శక్తి అక్కడి నీటికి చేరుతుందనే కథనం సైతం ఉంది.
గంగా, యమున, అంతర్వాహిని సరస్వతీ నదుల సంగమ ప్రదేశంగా, త్రివేణీ సంగమం పేరొందింది. ఈ త్రివేణి సంగమం ప్రయాగలో ఉంది. హరిద్వార్, నాశిక్, ఉజ్జయినీల్లో ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళా వస్తుంది. అయితే, ఈ నాలుగు తీర్థాల్లోని కుంభమేళ వేర్వేరు సంవత్సరాల్లో జరుగుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే నదీమ తల్లి వేడుక కుంభమేళా, 144 ఏళ్లకు ఒకసారి నిర్వహించే వేడుక మహా కుంభమేళాగా పిలుస్తారు. ఇక ప్రతి ఆరేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ స్నానపు పండుగను అర్థకుంభమేళా అని పిలుస్తారు. కుంభ అంటే కుండ, మేళా అంటే జన సమూహం అని అర్థం. అమృతభాండ సంబరానికి అసంఖ్యాక జనాలు రాకనే కుంభమేళాగా పెద్దలు అభివర్షిస్తారు.
వేదశాస్త్రాలు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఏడాదిపాటు నివాసం ఉంటాడు. పన్నెండు రాశులపై ప్రయాణించడానికి పన్నెండేళ్లు పడుతుంది. ఈ కారణంగానే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్ర పుణ్యనదీ ప్రాంతాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. మూడేళ్లకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఈ వేడుకలు జరుగుతాయి. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభమేళా జరుగుతుంది. దేవతల ఏకదినం మానవుల ఏడాది కాలం. దేవతల పగటి కాలం ఉత్తరాయణం, దేవతల రాత్రికాలం దక్షిణాయనం. పురాణాల ప్రకారం దేవ, దానవుల మధ్య సమరం పన్నెండేళ్లపాటు జరిగిందని అందుకు పండ్రెండు ఏళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారని పురాణ పెద్దలు చెబుతున్నారు. దేవతలకు పన్నెండేళ్లు అయితే మానవులకు 144 ఏళ్లు. అందుకే ఈ సమయంలో భువిలో మహా కుంభమేళా కార్యక్రమాన్ని అట్టహాసం చేస్తారు.
ఉత్తరాది కుంభమేళా అయినా, దక్షిణాది పుష్కరాలైన.. ఏవైనా నదీ పండుగలే. పన్నెండేళ్ల ప్రామాణికంగా తీసుకుని చేసుకునే నదీమతల్లి పండువలే. దేశంలోని పన్నెండు పుణ్య నదులను పుష్కర యోగ్య నదులుగా గుర్తించారు. ప్రతీ ఏడాది ఒక్కో నది చొప్పున మొత్తం 12 నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. పుష్కరాలు జరిగిన నదికి తిరిగి పుష్కరం రావడానికి పన్నెండేళ్లు పడుతుంది. పుష్కర నదులుగా పెద్ద నదులు ఉండడం సహజమే. అయితే, నదులకు ఉప నదులుగా ఉండి.. పుష్కరాల్లో స్థానం సంపాదించినవి కొన్ని ఉన్నాయి. గంగ, గోదావరి, నర్మద, సరస్వతి, యమున, కృష్ణ, కావేరీ సింధు నదులు ప్రధాన నదులుగా పుష్కర వేడుకలకు అర్హమైనవి. ఇక ఉప నదులుగా ఉన్న తుంగభద్ర, ప్రాణహిత, భీమా, తపతి నదులు పుష్కర నదులుగా యోగ్యత పొందాయి.
పండితోత్తముడు, మహా తపస్వి అయిన పుష్కరుడనే విప్రుడు తాను జలంలో జీవితుడుగా ఉండాలని, ఆ జలం అమృతజలంగా ఉండాలని శివదేవుడి నుంచి వరం పొందుతాడు. బ్రహ్మదేవుడు అమృతతుల్య జలాన్ని తన కమండలంలో భద్రపరుస్తాడు. అయితే, బృహస్పతి ఆ అమృతతుల్య జలాన్ని తనకిస్తే.. దేవతాగణాలతో పాటు సర్వగణాలను ఉద్దరిస్తానని చెబుతాడు. పుష్కరుడు బ్రహ్మలోకం వదలడానికి తొలుత ఇష్టపడడు. అయితే, బ్రహ్మ సర్దిచెప్పడంతో… పుష్కరుడు మెత్తబడతాడు. తాను ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణించే సమయంలో ఒక్కో నదిలో ప్రవేశించమని బృహస్పతి, పుష్కరుడిని కోరతాడు. ఇందుకు అంగీకరించిన పుష్కరుడు.. ప్రతి ఏడాది ఒక్కో పవిత్ర నదిలో ప్రవేశిస్తూ ఉంటాడు. అమృతమయమైన పుష్కరుడు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నదీ జలాలకు పాపాలు హరించే శక్తి, పుణ్య ఫలాలు సిద్ధించే శక్తి కలుగుతుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
ప్రతి పన్నెండేళ్లకు ఒక సారి ఒక పుణ్య నదికి పుష్కరాలు రాగా, ఆ పుష్కరాలు పన్నెండు రోజులపాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజుల్లో ఏ సమయంలో నదీ స్నానం చేసినా సర్వ పాపాలు పటాపంచలై, పుణ్యఫలాలు దక్కుతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే, పుష్కర సంవత్సరం ఏడాది పాటు ఉంటుందని పుష్కరాలు పన్నెండు రోజుల్లో ఏ వేళ పుష్కర స్నానం చేసినా ఈ ఫలం దక్కుతుందని చెబుతున్న పెద్దలు.. ఈ ఏడాది కాలంలో ప్రతి నిత్యం మిట్ట మధ్యాహ్నం వేళ కొన్ని ఘడియల్లో స్నానం చేస్తే పుష్కరఫలం దక్కుతుందని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే, ఆ పుష్కర ఘడియలు ఎప్పుడు ఉంటాయో తెలియనందున, పుష్కారాలు పన్నెండు రోజుల్లో ఏ సమయంలోనైనా చేసే నదీ స్నానమే ఉత్తమం అని తెలియజేస్తున్నారు. ఇక నదుల్లో గోదావరి నదికి మాత్రమే అంత్యపుష్కరాలు ఉంటాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. పుష్కర సంవత్సరం పూర్తయ్యే సందర్భంలో చివరి పన్నెండు రోజులు అంత్యపుష్కరాలుగా ఉంటాయని తెలియజేస్తున్నారు.
కుంభమేళాలు అయినా, పుష్కరాలు అయినా.. ఏదైనా నదీమ తల్లుల పండువలే. నదీమ తల్లుల పండువల్లో పుణ్యస్నానాల శోభ దర్శనమిస్తుంది. ప్రాణానికి జీవాధారమైన జలాన్ని అందించే నదీమ తల్లులను పూణ్యస్నానాలు ఆచరించడం ద్వారా పూజించి, ప్రకృతి శక్తులను ఆరాధించడం భారతీయుల ప్రాచీన సంప్రదాయమని ఆధ్యాత్మిక వేత్తలు, ధార్మిక గురువులు తెలియజేస్తున్నారు.