ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ తెతెరపైకి రానుందా? కొత్తగా కొలువతీరిన బీజేపీ ప్రభుత్వం ఈ తేనెతుట్టెను కదిలించనుందా? అంటు జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఆప్ అధికారంలో ఉండగా లిక్కర్ స్కామ్‌పై కాగ్ ఇచ్చిన రిపోర్టును తొక్కి పెట్టింది. అయితే సీఎం రేఖా గుప్తా తొలి కేబినెట్‌లోనే ఈ రిపోర్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఈ కాగ్ నివేదికలు సభలో ప్రవేశపెడతామని బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే.. ఆప్ హయాంలో జరిగిన కీలక నిర్ణయాలపై చర్చ జరుగుతండటం ఒక్క ఢిల్లీలోనే కాకుండా తెలంగాణలో కూడా ప్రకంపనలు సృష్టించబోతుంది.
లిక్కర్ పాలసీ కేసు ఢిల్లీతో పాటు తెలంగాణలో కూడా సంచలనంగా మారింది. ఈ కేసులోనే అర్వింద్ కేజ్రివాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లారు. ఇప్పటికీ ఢిల్లీ కోర్టులో ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉంది. ఇలాంటి సమయంలో ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి లిక్కర్ స్కామ్ తేనె తుట్టను కదిలించాలని ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 24 నుంచి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే కాగ్ రిపోర్టులపై 25న సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నివేదికలు స్పీకర్ కార్యాలయానికి కూడా అందినట్లు తెలిసింది.
ఆప్ ప్రభుత్వ హయాంలోనే కాగ్ నివేదికలు వచ్చినా.. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఎన్నికలు ఉన్నందునే కావాలని ఆప్ నివేదికలను తొక్కి పెట్టిందని బీజేపీ ఆరోపించింది. అర్వింద్ కేజ్రివాల్ మద్యం పాలసీ కారణంగా రాష్ట్ర ఖజానాకు 2 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని గతంలోనే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విమర్శించారు. మద్యం పాలసీ పూర్తిగా దారి తప్పిందని.. ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చి.. మనీ లాండరింగ్ ద్వారా ఆప్ కోట్ల రూపాయలను తమ జేబులో వేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు పాలసీ విధానంలో కూడా అవకతవకలు జరిగినట్లు నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
2021 నవంబర్‌లో ఈ పాలసీని ఆప్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అయితే దీంట్లో అవకతవకలను గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్.. విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఆయన సీబీఐ విచారణకు ఆదేశించగా.. అందులో మనీలాండరింగ్ కోణం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో ఈడీ కూడా రంగప్రవేశం చేసి.. దర్యాప్తులో పలువురి పాత్రను గుర్తించింది. కేజ్రివాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌తో పాటు కవిత కూడా అరెస్టు అయ్యారు. ఈ పాలసీ కంటే ముందు ఢిల్లీలో ప్రభుత్వమే మద్యం రిటైల్‌గా విక్రయించేది. కానీ లిక్కర్ రిటైల్ ట్రేడింగ్‌లో గేమ్ చేంజర్‌గా పేర్కొంటూ ఈ పాలసీని అప్పటి ప్రభుత్వం తెచ్చింది. కొందరికి లైసెన్స్‌లు అందించి.. పెంచిన 12 శాతం మార్జిన్‌ల నుంచి సగం ఆప్ పార్టీకి అందేలా పకడ్బందీగా పాలసీలో లూప్స్ హోల్స్ పెట్టారనేది ప్రధాన ఆరోపణగా ఉంది.
లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించిందని.. ఇందులో కవిత కీలక పాత్రధారి అని ఈడీ, సీబీఐలు పేర్కొన్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత కూడా నిందితురాలిగా తేలడంతో తెలంగాణలోనూ ఈ కేసు చర్చనీయాంశమైంది. సౌత్ గ్రూప్‌లో ఆమె కీలక సభ్యురాలని, ఆప్‌కు డబ్బులు అందడంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. తిహార్ జైలుకు వెళ్లిన ఆమెను సీబీఐ, ఈడీ పలుమార్లు విచారించింది. సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 27న ఆమెకు బెయిల్ మంజూరు చేయగా విడుదలైన ఆమె.. తనను కుట్రపూరితంగా జైలుకు పంపినవారికి మిత్తితో సహా వడ్డిస్తానని హెచ్చరించారు. ఆ తర్వాత రాజకీయంగా కూడా కవిత కాస్త సైలెంట్ అయ్యారు.
తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే లిక్కర్ స్కామ్ గురించి మరిచిపోతున్న సమయంలో మరోసారి ఢిల్లీ ప్రభుత్వం దానిపై చర్చ మొదలు పెట్టడం బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారనుంది. ముఖ్యంగా కవితకు ఇది రాజకీయంగా మైనస్‌గా మారే అవకాశం ఉంది. మరి ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని కేవలం చర్చకే పరిమితం చేస్తుందా? లేదంటే మరోసారి లిక్కర్ స్కామ్ నిందితులను జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తుందా అనేది వేచి చూడాలి.