సీనియర్ రాజకీయ నాయకుడు, బీజేపీ నాయకురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, పురందేశ్వరి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు పూర్తిగా డబ్బుమయంగా మారిపోయాయని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచినా ప్రజల నుంచి చీత్కారాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించి ఓ ఉదాహరణ కూడా చెప్పారు.
ఓడరేవులో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి వారికి జీతాలు చెల్లించేలా రిసార్ట్స్ వాళ్లతో మాట్లాడారని, కానీ, కొండయ్య డబ్బులు వసూలు చేస్తున్నారని వార్తలు రాశారని పేర్కొన్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు వైశ్య కమ్యూనిటీ నుంచి విరాళాలు సేకరించే సమయంలోనూ ఇలాంటి వార్తలే రాశారని తెలిపారు. డబ్బులు ఖర్చు చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామన్నా ఆరోపణలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తన అదృష్టమని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాజకీయాలను వదిలేసిన అదృష్టవంతుడినని తనకు తానే కితాబునిచ్చుకున్నారు. రూ. 30 కోట్లు పెట్టి ఎన్నికల్లో గెలిస్తే, గెలిచాక మరో రూ. 40 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు. రాజకీయంగా ఇదే తన చివరి ప్రసంగమని స్పష్టం చేశారు. మిగతా జీవితాన్ని పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తానని చెప్పుకొచ్చారు. రాజకీయాల నుంచి సంతోషంగా రిటైరయ్యాననే భావన తనకు కలుగుతోందని చెప్పారు.