పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనుంది. దశల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయను న్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్థలం ఉన్న వారికి.. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందజేస్తారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు 5 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను ప్రభుత్వం రూపొందించింది. తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ నమూనాలను తీర్చిదిద్దారు.
యాదాద్రి నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి వస్తారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 5 వేల మంది మహిళలతో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. భోజనానంతరం నీటిపారుదల, దేవాదాయ ఉన్నతాధికారులతో పలు అంశాలపై సీఎం రేవంత్, మంత్రులు సమీక్షలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 4 గంటలకు మణుగూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. బహిరంగ సభలో ప్రసంగం అనంతరం సాయంత్రం 6.10 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.