ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ తన భారత పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని లండన్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి ఇకపై ఆయన భారత పౌరుడిగా లెక్కించబడడు. అదే సమయంలో లలిత్ మోడీ వనౌట్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ పరిణామం చట్టపరమైన ప్రశ్నలు, రాజకీయ చర్చలకు దారి తీసింది.
మోడీ దక్షిణ పసిఫిక్ ద్వీప దేశమైన వనౌట్ పౌరసత్వం పొందినట్లు తెలిసింది. ఆయన 2010లో భారతదేశాన్ని విడిచిపెట్టి అప్పటి నుంచి లండన్‌లో నివసిస్తున్నారు.
ఐపీఎల్ టాప్ బాస్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ ఐపీఎల్ చీఫ్ కోసం గాలిస్తున్నాయి.
వనౌట్ పౌరసత్వం కావాలంటే దాదాపు 1,30,000 డాలర్ల పెట్టుబడి పెడితే సరిపోతుంది. వనౌట్ దేశం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సమీపంగా ఈ దేశం ఉంది. 80కు పైగా చిన్న చిన్న ద్వీపాలతో ఉంటుంది. కొన్ని కేసులను తప్పించుకునేందుకు కొందరు ఈ దేశ పౌరసత్వాన్ని తీసుకుంటారు. లలిత్ మోడీ కూడా సరిగ్గా ఇదే పనిచేశారు.
“లలిత్ మోడీ లండన్‌లోని భారత హైకమిషన్‌లో తన పాస్‌పోర్ట్‌ను అప్పగించడానికి దరఖాస్తు చేసుకున్నాడు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
“ప్రస్తుత నియమాలు, విధానాల దృష్ట్యా దీనిని పరిశీలిస్తాము. అతను వనౌట్ పౌరసత్వాన్ని పొందాడని కూడా మేము అర్థం చేసుకున్నాము. చట్టం ప్రకారం అతనిపై కేసును కొనసాగిస్తాం” అని రణధీర్ జైస్వాల్ అన్నారు.
అంటే పౌరసత్వం మారినంత మాత్రాన భారత ప్రభుత్వం అతనిపై నేర విచారణను వదిలిపెట్టదని స్పష్టం చేసింది. గతంలోనూ డిఫాల్టర్లు విదేశాలకు పారిపోయిన సందర్భాల్లో ఎక్స్‌ట్రడిషన్ ప్రక్రియలు భారత్‌లో నెమ్మదిగా సాగిన ఘటనలను పలువురు గుర్తు చేస్తున్నారు. లలిత్ మోడీ మాదిరిగానే కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు పలు సంస్థలను మోసగించి విదేశాలకు పారిపోయి పౌరసత్వ మార్పులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ లాంటి వారింతా ఈ కోవకు చెందిన వారే. చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నారు. భారత ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నా చాలా సమయం ఏర్పడే పరిస్థితి. లలిత్ మోడీ భారత పౌరసత్వం వదులుకోవడం.. వనౌట్ పౌరసత్వం తీసుకోవడం బట్టి చూస్తుంటే ఏదైనా లీగల్ లూప్‌హోల్ ఉపయోగించుకుంటున్నాడా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనిపై ఉన్న కేసులను భారత ప్రభుత్వం ఎలా ముందు తీసుకెళ్తుందనే విషయం చూడాలి.