స్వతంత్ర వెబ్ డెస్క్: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల, డిమాండ్ అని.. తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్ కి 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చిన ప్రధాని, 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అన్నారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన ప్రధాని మోదీ అని, 9 ఏళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్తే బాగుండేదంటూ సెటైర్లు వేశారు.
ప్రధాన మంత్రి మోదీ స్పీచ్ మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు. తెలంగాణకి వచ్చిన ప్రతిసారి కేవలం రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం అలవాటుగా మారిందని కేటీఆర్ అన్నారు. మన రాష్ట్రానికి ఏం చేయగలరో చెప్పకుండా, ఉపన్యాసం ఇచ్చి వెళ్లడం పరిపాటిగా మారిందన్నారు. గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసి అన్యాయాన్ని గుర్తుంచుకుని, బీజేపీ నిరంకుశ వైఖరిని గుర్తుంచుకొని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని రాష్ట్రం నుంచి తన్ని తరిమేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ పునః ప్రారంభం కాలేదు. రాష్ట్రంలోని జాతీయ రహదారి ప్రాజెక్టుల నుంచి మొదలుకొని, నూతన రైల్వే లైన్లు ఏర్పాటు, రైల్వే లైన్ల బలోపేతం వంటి అన్ని రకాల డిమాండ్లను కేంద్రం పక్కనపెట్టడం రాష్ట్రంపై ప్రధానమంత్రి ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.


