స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వాసులకు శుభవార్త అందించినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సచివాలయం మూడవ అంతస్తులో ఉన్న తన కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు. ఇక నుంచి ఆ కార్యాలయంలోనే కేటీఆర్ తన విధులు నిర్వర్తించనున్నారు. మరోవైపు మొదటి అంతస్తులోని కార్యాలయం నుంచి ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా రేపు మధ్యాహ్నం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది.