స్వతంత్ర వెబ్ డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఎల్లుండి ఆయన తిరిగి కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే తన ధ్యేయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదని.. తన ఆశయం ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. “ఏడాదిన్నర క్రితం బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. అనంతర రాజకీయ పరిణామాల్లో బీజేపీ కొంత డీలా పడింది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. ప్రజల ఆలోచనల మేరకు వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే లక్ష్యం. నేను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లినా.. కమలం నుంచి హస్తానికి తిరిగి వస్తున్నా.. రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలన, కుటుంబ రాజకీయం, అవినీతిని అంతమొందించాలనే లక్ష్యంతోనే” అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.