నానమ్మ కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. కులాంతర వివాహం చేసుకుందని చెల్లెలి భర్తపై పగ పెంచుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి స్కెచ్ వేశాడు. స్నేహితుడు, చెల్లెలి భర్త అనే బంధుత్వం కూడా చూడకుండా దారుణంగా హత్య చేయించాడు.
సూర్యాపేట జిల్లా పరువుహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిని హత్య చేసేందుకు.. అతని భార్య భార్గవి కుటుంబ సభ్యులు పథకం వేసినట్టు తేలింది. జనవరి 19 న మొదటిసారి అతనిని హత్య చేసేందుకు పన్నాగం వేయగా అప్పుడు అమలు కాలేదు. రెండోసారి పకడ్బందీగా ప్లాన్ చేసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా భార్గవి నానమ్మ బుచ్చమ్మని తేలింది.
ఈ కేసులో భార్గవి సోదరుడు కోట్ల నవీన్ ప్రధాన నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. భార్గవి నానమ్మ బుచ్చమ్మ.. మనవరాలు కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో.. తన కొడుకు, మనమళ్లను రెచ్చగొట్టి హత్యకు పరోక్షంగా కారణమైనట్లు పోలీసులు తేల్చారు. రెండు నెలలుగా వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిని హత్య చేసేందుకు కుట్ర చేసినట్టుగా తెలుస్తోంది. హత్యకు ఐదు లక్షల సుపారీ ఇచ్చినట్టు సమాచారం.
జనగామ క్రాస్ రోడ్డు సమీపంలోని ఆదివారం రాత్రి కృష్ణను హత్య చేశారు. హత్య చేసిన తర్వాత నవీన్, దుండగులు.. మృతదేహంతో కారులో షికారు చేశారు. తర్వాత నానమ్మ బుచ్చమ్మకు శవాన్ని చూపించి నల్గొండలో ఉన్న మరొక మిత్రుడికి శవాన్ని చూపించినట్లు తేలింది. రాత్రంతా జాతీయ రహదారిపై మృతదేహంతో షికారు చేశారు. తొలుత నల్గొండ పరిసరాల్లోనే మృతదేహాన్ని వదిలేయాని భావించారు. చివరికి పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై డెడ్‌బాడీని పడేసి పరారయ్యారు.
ఈ కేసులో తాళ్లగడ్డకు చెందిన బైరు మహేశ్, నల్గొండకు చెందిన మరో యువకుడతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. మృతుడు కృష్ణ, నిందితుడు నవీన్‌లు స్నేహితులని తెలిసింది. స్నేహం పేరుతో నవీన్ ఇంటికి వచ్చి చెల్లెలు భార్గవిని ప్రేమించాడు. పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే భార్గవి కుటుంబం పగతో రగిలిపోయి చివరకు కృష్ణ ప్రాణాలు తీశారు.