స్వతంత్ర వెబ్ డెస్క్: కెనడాలోని టొరంటోలో భారత రాయబార కార్యాలయం ఎదుట ఖలిస్థాన్ మద్దతుదారులు ప్రదర్శన చేపట్టారు. దీనికి ప్రతిగా మువ్వన్నెల జెండాలతో భారతదేశ మద్దతుదారులు ప్రదర్శన నిర్వహించారు. కెనడా కాలమానం ప్రకారం శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ఖలిస్థాన్ మద్దతుదారులు జెండాలతో భారత రాయబార కార్యాలయం చేరుకుని నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనపై మండిపడ్డ భారత సంతతి ప్రజలు త్రివర్ణ పతాకాలతో అక్కడికి చేరుకుని ప్రదర్శన చేశారు.
జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధిపతి, ఎస్‌ఎఫ్‌జే నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై నిరసనకు దిగారు. ఆయన హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు. భారత జాతీయ జెండాను అవమానించేందుకు ప్రయత్నించారు. అయితే టొరంటోలోని ప్రవాస భారతీయులు కూడా పోటీగా ప్రదర్శన చేపట్టారు. భారతీయ జెండాలను చేతపట్టారు. ‘జై భారత్ మాతా’, ‘వందేమాతరం’ వంటి నినాదాలు చేశారు. ఖలిస్థాన్ ర్యాలీని ప్రతిఘటించారు. ‘ఖలిస్థానీలు సిక్కులు కాదు’, ‘ఉగ్రవాదులు’ అన్న ఫ్లకార్డులను ప్రదర్శించారు.
పోటాపోటీగా ఇరు పక్షాలు ప్రదర్శన చేపట్టడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాల మధ్య బారికేడ్లు పెట్టి విడదీశారు. ఈ నిరసనలకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 8న భారత రాయబార కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టాలని ఖలిస్థాన్ మద్దతుదారులు ఆన్ లైన్ లో కొన్నిరోజులుగా ప్రచారం నిర్వహించారు. దీనికి తోడు ఇటీవల ఇండియన్ ఎంబసీలపై దాడులు పెరిగిపోతున్నాయి. దీంతో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ ఏర్పాట్లను అమెరికాలోని భారతదేశ అంబాసిడర్ తరణ్ జీత్ సింగ్ సంధు పరిశీలించారు.