ఎన్డీయే, చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ప్రజలంతా ఓట్లు వేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎక్కడ తప్పు జరిగినా స్పందించే గుణం ఉండాలన్నారు. తప్పు జరిగితే అది తమ అందరి సమష్టి బాధ్యత అని చెప్పారు. అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించానని… మనస్ఫూర్తిగా క్షమాపణ కోరినట్లు తెలిపారు.
పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. తిరుపతిలో ఎవరి బాధ్యత వాళ్లు సరిగా చేస్తే సరిపోయేదని అన్నారు. కొంతమంది చేసిన తప్పునకు జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఫలితం అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. ఉద్యోగి, అధికారి.. ఎవరైనా వారి బాధ్యతలు సరిగా నిర్వర్తించాలన్నారు. గత ప్రభుత్వంలో అలవాటుపడి కొంతమంది పనిచేయడం మానేశారని పవన్ విమర్శించారు.
గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం స్కామ్‌ల్లో రికార్డు సృష్టించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం పల్లె పండుగ, గోకులాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందన్నారు.