స్వతంత్ర వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy)నోరు అదుపులో పెట్టుకోవాలని.. అగ్రకుల అహంకారంతో చేసే వ్యాఖ్యలు మానుకోవాలని.. లేకుంటే బీసీల మంతా ఏకమై సత్తా ఏంటో చూపుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas reddy) హెచ్చరించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని రవీంద్రభారతి, చిక్కడపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. బీసీ నాయకులపై, పోలీసులపై రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని రాబోయే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.
బీసీలను(BC) అగ్రకుల నాయకులు అనగా తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్నను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి బడుగుల రాజ్య స్థాపనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి పాపన్న గౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, కార్పొరేషన్ చైర్మన్‌లు పల్లె రవికుమార్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఐఏఎస్ బుర్ర వెంకటేశం గౌడ్, గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.