స్వతంత్ర వెబ్ డెస్క్: మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలను కలుపుకొని పోయిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నారు. 115 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను సోమవారం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వామపక్షాలతో పొత్తు లేదనే విషయాన్ని సీఎం చెప్పకనే చెప్పేశారు.
కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు లేదంటూ సీఎం కేసీఆర్ తేల్చేసిన నేపథ్యంలో నేడు(మంగళవారం) వామపక్షాలు కీలక సమావేశం కానున్నాయి. మధ్యాహ్నం హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై చర్చించనున్నాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తమను అవసరానికి వాడుకున్నారని మండిపడ్డారు.
మునుగోడులో ఆయనకు కేసీఆర్‌కు అవసరం ఉంది కాబట్టి పిలిచారని.. అక్కడ బీజేపీని ఓడించేందుకు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామని తెలిపారు. రాజకీయాల్లో మోసం చేసే వాళ్లు ఉంటారని, తాము బీఆర్‌ఎస్‌ను నమ్ముకొని లేమని పేర్కొన్నారు. ఎవరైనా కలిసొస్తే పోటీ చేస్తామని.. లేకుంటే ఒంటరిగా పోటీచేస్తామన్నారు.