ఒకసారి కాదు.. రెండుసార్లు. అది కూడా తిరుగులేని విధంగా అధికారం చెలాయించారు. ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెట్టారు. కానీ, పవర్ కోల్పోయేసరికి డీలా పడిపోయారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకుంటూ సరిదిద్దుకునే పనిలో పడ్డారు. అవును. అధికారంలో ఉన్నంతవరకు పార్టీ నిర్మాణం, కమిటీలపై అంతగా దృష్టి సారించని గులాబీ పార్టీ ఇప్పుడు మళ్లీ వాటిపై ఫోకస్ పెడుతోంది. సంస్థాగతం గా బలంగా ఉంటేనే అధికార పార్టీని ఎదుర్కోగలమని భావిస్తోంది. అందుకే త్వరలోనే మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది.
బీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా మొన్నటి వరకు పరిస్థితి నడిచింది. కానీ, ఒక్క ఎన్నికలు, ఒకే ఒక్క ఎన్నికలతో పరిస్థితి అంతా తారుమారైంది. 2014 నుంచి అప్రతిహతంగా సాగిన గులాబీ పార్టీ విజయ ప్రస్థానానికి 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమితో బ్రేక్ పడింది. సాధారణంగా ఎన్నికలన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ, కారు పార్టీ గతంలో చేసిన కొన్ని పనుల కారణంగా ఒక్క ఓటమితో ఆ పార్టీ నేతలే కాదు. క్యాడర్ సైతం చెల్లాచెదురయ్యే పరిస్థితి నెలకొంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు అదే పద్దతి ఫాలో అవుతోంది నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. దీంతో ఎమ్మెల్యే కప్పదాట్లపై విమర్శలు చేయలేక.. అలాగని ఊరుకోలేక లోలోన సతమతమవుతున్న పరిస్థితి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్, లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఓవైపు కవిత అరెస్ట్‌తో ఆత్మరక్షణలో పడిన బీఆర్ఎస్ అధినాయకత్వం.. సరైన నేతలు, నాయకులు పార్లమెంటు ఎన్నికల నాటికి తమ పార్టీలో లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వారితోనే ముందుకెళ్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే గతమెంతో ఘనం అన్న పరిస్థితిని ఈ సందర్భంగా నేతలు గుర్తు తెచ్చుకున్నారన్న వ్యాఖ్యలు విన్పించాయి. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఎంత అంటే ఎవరూ సరిగ్గా చెప్పలేని పరిస్థితి. ఇందుకు కారణం క్షేత్రస్థాయిలో కారు పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదన్న రిపోర్ట్‌లు ఇప్పటికే అధినేత కేసీఆర్‌కు చేరినట్లు సమాచారం. దీంతో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు గులాబీ బాస్ అన్న మాట విన్పిస్తోంది.
త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇవి క్షేత్రస్థాయిలో ఏ రాజకీయ పార్టీకైనా చాలా ముఖ్యమైనవి. దీంతో ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి అధికార కాంగ్రెస్ పార్టీ హవాకు అడ్డుకట్ట వేయాలని యోచిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే త్వరలోనే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను ప్రక్షాళించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడంలో భాగంగా అధినేత కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చాలా చోట్ల పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, రానున్న రోజుల్లో ఇది పునరావృతం కానీయవద్దని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడే వారికి బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయం గట్టిగా విన్పిస్తోంది. అలాగే అనుబంధ కమిటీలను సైతం పూర్తిస్థాయిలో నియమించి క్యాడర్‌ను యాక్టివేట్ చేయాలని, తద్వారా రేవంత్ ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎండగట్టడంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలను వెనక్కు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాత కమిటీలను పూర్తిగా రద్దు చేయాలని త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న ప్రచారం బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా విన్పిస్తోంది. అదే సమయంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బలమైన నేతలు ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై గులాబీ బాస్ రిపోర్ట్‌లు తెప్పించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీలను జూన్ 2022లో చివరి సారిగా ప్రకటించారు. ఇందులో భాగంగా 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. కానీ, కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవులు ఖాళీగా ఉన్నాయి. అంతే కాదు. ఆయా జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను సైతం నియమించలేదు. పైగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో ఏకంగా 19 మంది ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. దీంతో తమకు అవకాశం రాలేదని పార్టీలో మొదటి నుంచీ కష్టపడి పనిచేస్తున్న నేతలు భావించారు. కొందరు ఉద్యమకారులు పార్టీలో జరుగుతున్న పరిణామాలను, జరుగుతున్న అన్యాయాలను సహించలేక ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఒకటి కారణమని అధినేత అంచనాకు వచ్చారు. పార్టీ అనుబంధ కమిటీలైన మహిళ, యువత, రైతు, కార్మిక, విద్యార్థి, సోషల్ మీడియా ఇలా పలు కమిటీలను సైతం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఫలితంగా అధికారంలోకి వచ్చి ఏళ్లు గడిచినా తమకు మాత్రం ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి ఆయా వర్గాల్లో ఉంది. ఇదంతా కలిసి పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజీ చేసిందని ఆలోచిస్తున్నా రు. ఇక, కొన్ని చోట్ల మండల, గ్రామ స్థాయి అధ్యక్షుల్ని నియమించినా సభ్యులను నియమించకపోవడం కూడా మైనస్‌గా భావిస్తున్నారు. వాస్తవానికి ఆరేళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీని 69 మంది సభ్యులతో ప్రకటించింది. ఆ కమిటీలో ఉన్న వారిలోపలువురు పార్టీ మారారు. అయినా సరే కొత్త వారిని ఇందులోకి తీసుకోలేదు అధిష్టానం. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా ఇప్పటివరకు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించని విషయాన్ని ఈ సందర్భంగా కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.
ఇలా ఒకటీ రెండూ కాదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా బీఆర్ఎస్ ఓటమికి ఎన్నో దోహదం చేశాయి. అయితే, మొదట్లోనే ఈ విషయాల్లో మేలుకోని గులాబీ పార్టీ. ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిందన్న విమర్శలు సైతం ఉన్నాయి. అందువల్లే త్వరలోనే రాష్ట్రం లోని పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. గతానికి భిన్నంగా పార్టీలో పూర్తిస్థాయిలో యాక్టివ్‌గా ఉన్న వారికే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకు న్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పదవులు, బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటకే ఆ దిశగా కొందరికి కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, అన్నింటి కంటే ముఖ్యంగా ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్‌లో ఉద్యమకారులకే తగిన గుర్తింపు లేదన్న మాట గత కొంత కాలంగా ఎక్కువగా విన్పిస్తోంది. దీంతో ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న వారికి పెద్ద పీటా వేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. అందుకే పలువురు ఉద్యమ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రజల్లో మళ్లీ బీఆర్ఎస్ పట్ల మరింత ఆదరణ పెరిగేలా చూసేందుకు పక్కాగా స్కెచ్చులేస్తు న్నారు గులాబీ బాస్. అదే సమయంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో కొత్తగా ఎంపిక చేసే నాయకులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించేలా చూడనున్నారు. తద్వారా క్షేత్రస్థాయి లో పార్టీ పరిస్థితులపై అధిష్టానం స్వయంగా ఫోకస్ పెట్టనుంది. త్వరలోనే రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడాలని భావిస్తోంది బీఆర్ఎస్. అప్పుడే అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కోగలమని యోచిస్తోంది. మరి గులాబీ బాస్ వ్యూహాలు ఎంత మేరకు వర్కవుటవుతాయి అన్నది త్వరలోనే తేలనుంది.