లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయం రైతుల చుట్టూ తిరుగుతోంది. రైతుల అంశం అజెండాగా ఫామ్ హౌస్ వీడి పొలం బాట పట్టారు మాజీ సీఎం కేసీఆర్. ఎండిన పంటల పరిశీలన పేరుతో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించి.. పంటలను పరిశీలించిన కేసీఆర్.. రేపు కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. రైతు సమస్యలే అస్త్రాలుగా పార్లమెంట్ ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్ధ పాలన వల్లే పంటపొలాలు ఎండుపోతున్నాయని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారని నల్గొండ పర్యటనలో ఆరోపణలు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ వచ్చింది.. రైతులకు నీటి కష్టాలు వచ్చాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో ప్రాజెక్టుల్లో నీటిని వదిలేసారని ప్రభుత్వంపై ఎదురుదాడికి ప్లాన్ చేశారు. బీఆర్‌ఎస్‌పై కక్షతో రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. కాలంతో వచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లి ప్రభుత్వంపై బాణాలు సంధిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఇదే అస్త్రాన్ని ప్రయోగించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తేం దుకు బహిరంగ సభలకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న చేవెళ్లలో, ఈ నెల 15 వ తేదీన మెదక్ లో బిఆర్ఎస్ బహిరంగ సభలకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.