స్వతంత్ర వెబ్ డెస్క్ : తెలంగాణకు త్వరలో మూడో ఎయిర్‌పోర్టు రానుంది. వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి సంబంధించి తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మామునూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటు నిమిత్తం కేంద్రం అడిగిన మొత్తం భూమిని కేటాయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత శాఖల మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే.. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పట్టణమైన వరంగల్ నగరవాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దీంతో పాటు హకీంపేట విమానాశ్రయం నుంచి పౌర సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. హకీంపేట ఎయిర్‌పోర్టు కూడా అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు తీరుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్.. మీడియాకు వెల్లడించారు.
‘పుణేలో, గోవాలో రక్షణ రంగానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్లను పౌర విమాన సేవలకు కూడా వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను కూడా ఇదేవిధంగా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి నివేదిస్తాం’ అని కేటీఆర్ చెప్పారు. హకీంపేట ఎయిర్‌పోర్టును కేంద్రం నిర్వహించినా సరే. రాష్ట్రం నిర్వహించినా సరేనని.. హైదరాబాద్‌లో రెండో ఎయిర్‌పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలనేది తమ అభిమతమని కేటీఆర్ వివరించారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి ఇది అవసరమని పేర్కొన్నారు. ఇప్పుడున్న ‘రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు’కు అదనంగా ఈ రెండు ఎయిర్‌పోర్టుల (హకీంపేట, మామునూరు) సేవలు అందుబాటులోకి వస్తే.. తెలంగాణ రాష్ట్రవాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేటీఆర్ వెల్లడించారు. అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని ఆయన చెప్పారు.