మనదేశంలో రైలు ప్రమాదాలు కొత్తకాదు. స్వాతంత్య్రం తరువాత దేశంలో అనేక ఘోరమైన రైలు ప్రమాదాలు జరిగాయి. కొన్ని ప్రమాదాలకు సాంకేతిక లోపాలు కారణంకాగా మరికొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమయ్యాయి. వీటి సంగతి ఎలాగున్నా ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాగా రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడానికి దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ….కవచ్‌ను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 10 వేల లోకోమోటివల్‌లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ని సందర్శించిన సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయం వెల్లడించారు.
వాస్తవానికి కవచ్ రక్షణ వ్యవస్థ ..ప్రధానంగా జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది. పట్టాలపై వస్తువులు ఉంటే, రెడ్ సిగ్నల్ ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు నడిపితే…కవచ్ వ్యవస్థ అప్రమత్తమవుతుంది. బ్రేక్‌లను సదరు కవచ్ వ్యవస్థ..తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. అంతిమంగా ప్రమాదాలను నియంత్రిస్తుంది. అంతేకాదు నిర్ణీత వేగాన్ని మించి ..రైలు ప్రయాణించడాన్ని కూడా కవచ్ అనుమతించదు.
ప్రమాదాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ కొంతకాలంగా ఒక మోడర్న్ టెక్నాలజీపై కసరత్తు చేస్తోంది. అదే ..కవచ్ వ్యవస్థ. కవచ్ అంటే అధునాతన సాంకేతిక రక్షణాత్మక వ్యవస్థ. రైళ్లు పరస్పరం ఢీకొనడాన్ని నివారించడమే కవచ్ వ్యవస్థ ప్రధానోద్దేశం. సహజంగా రెండురాళ్లు ఒకేసారి ట్రాక్ మీదకు వచ్చి ఢీకొనడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. దీనిని నివారించడానికే కవచ్ పేరుతో సరికొత్త టెక్నాలజీని తీసుకురావాలని నిర్ణయించుకుంది రైల్వే మంత్రిత్వ శాఖ. ప్రధానంగా సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సిద్దమైంది.
కవచ్ టెక్నాలజీని రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. మనదేశంలో రైళ్ల ప్రమాదాలను విశ్లేషిస్తే, 89 శాతం ప్రమాదాలు మానవ తప్పిదంతోనే సంభవించాయని వెల్లడైంది. దీంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసి యాంటీ కొలీషన్ పరికరాలు రైల్వేమంత్రిత్వ శాఖ రూపొందించింది. దీనిని మొట్టమొదట కొంకణ్ రైల్వే పరిధిలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అనంతరం ఈశాన్య రైల్వే పరిధిలోనూ పరీక్షించారు. ఆ రెండు చోట్ల ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీంతో ఈ వ్యవస్థకు కవచ్ అనే పేరు పెట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని రైల్వేమంత్రిత్వ శాఖ మొదట నిర్ణయించింది.
కవచ్ పూర్తిగా స్వదేశీ అధునాతన పరిగ్నానంతో రూపొందించిన వ్యవస్థ. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కవచ్ వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థకు ఎస్‌ఐఎల్ – 4 సర్టిఫికేషన్ కూడా రావడం విశేషం. భవిష్యత్తులో రైల్వే ట్రాక్ లను కూడా కవచ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. ఇస్రో ఉప గ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్ స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీద రెండు రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెమ్ సాయంతో ఆటోమేటిక్‌గా ఆ రెండు రైళ్లకు సమాచారం చేరుతుంది. దీంతో వెంటనే రైలులో ఆటోమేటిక్ బ్రేకులు పడతాయి. రైలు నిలిచిపోతుంది. అంతిమంగా రైలు ప్రమాదాన్ని నివారించడం వీలవుతుంది.