స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై ‘సనాతన ధర్మంపై’ మరో విడత డీఎంకే నేతలను టార్గెట్ చేసుకున్నారు. మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పీకే శేఖర్ బాబు సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
‘‘తిరు ఉదయనిధి స్టాలిన్, తిరు శేఖర్ బాబు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ పిలుపు ఇచ్చిన తర్వాత.. అన్ని వైపుల నుంచి వస్తున్న ఖండనలు, విమర్శలతో ఇప్పుడు హిందుయిజం, సనాతన ధర్మం వేర్వేరు అని చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన 12వ తరగతి టెక్ట్స్ బుక్ లో సనాతన ధర్మం, హిందూయిజం ఒక్కటే అని ఉంది. సనాతన ధర్మం అనేది శాశ్వతమైన ధర్మమని పేర్కొంది. కనుక పీకే శేఖర్ బాబు, ఉదయనిధి స్టాలిన్ 12వ తరగతిలో ప్రవేశం పొంది జ్ఞానోదయం పొందాలని మా సూచన’అని అన్నామలై పోస్ట్ పెట్టారు.
టెక్ట్స్ బుక్ లో సనాతన ధర్మం, హిందూయిజం ఒక్కటేనన్న ఫొటోలను కూడా షేర్ చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా, ఎయిడ్స్ వ్యాధులతో పోలిస్తూ, దాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా సైతం దీన్ని తప్పుబట్టారు. సనాతన ధర్మంపై డీఎంకే నేతల అవమానకర వ్యాఖ్యలను వింటూ తాము మౌనంగా ఉండబోమన్నారు.