ఏపీ ఎన్నికల్లో స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది పిఠాపురం. పోలింగ్ శాతంలో రికార్డ్ బద్దలు కొట్టి ఎలక్షన్ వేళ అందరి చూపుని తన వైపుకి తిప్పుకుంది. అందుకు కారణం జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ బరిలో నిలవడమే. ఇంతకీ పిఠాపురం రికార్డ్ సృష్టించడానికి కారణాలేంటి..? పవనోత్సాహ మే అందుకు రీజనా..?
ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. జగన్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా నువ్వా నేనా అన్న రేంజ్‌లో సమ్మర్‌ని మించి పొలిటికల్ హీట్‌ని పెంచాయి. అధికార పార్టీ ఎలాగైనా మట్టి కరిపించాలన్న కసిలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్కటిగా రణరంగంలోకి దిగాయి. ప్రభుత్వ ఓటును చీలనివ్వనని కంకణం కట్టుకున్న సేనాని, అదే దిశగా వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగారు. ముందుగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీని మళ్లీ అదే కూటమిలో చేర్చేందుకు పెద్దన్న పాత్ర పోషించారు. దీంతో ఎడ ముఖం, పెడ ముఖంగా ఉన్న బీజేపీ, టీడీపీలు కలిసిపోయాయి. మళ్లీ మిత్ర బంధాన్ని కొనసాగించాయి. ఇలా జగన్‌ను మట్టికరిపించేందుకు అంతా ఒక్కటిగా ఎన్నికల బరిలోకి దిగాయి. ఇలా పవన్‌కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తే, మరోవైపు తన గెలుపుపై కూడా అదే ఎత్తుగడతో ముందుకు సాగారు.
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి, ఒక పార్టీ అధినేతగా చిత్తుగా ఓడిపోయారు. దీంతో ఎలాగైనా ఈసారి పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితితో కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓటమే టార్గెట్‌గా తన గెలుపే లక్ష్యంగా పావులు కదిపారు. ఈ కారణంగానే పిఠాపురంలో ఓటింగ్ శాతం దుమ్ములేపిందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జనం ఓటు కోసం పోటెత్తారని, అందుకే రికార్డ్ స్థాయిలో ఈసారి 86.63 శాతం పోలింగ్ నమోదు అయిందని చెబుతున్నారు రాజకీయవర్గాలు. పవనోత్సాహమే ఇందుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మనం ఓసారి గత ఎన్నికల్లో పోలింగ్ సరళి చూసుకుంటే, 2014లో 79.44శాతం 2019లో 80.92 శాతమని లెక్కలు చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈసారి ఓటింగ్ పోటెత్తిందని అర్థమవుతోంది.
ఇక పిఠాపురం బరిలో నిలిచిన పవన్‌కల్యాణ్ మొదటి రోజు నుంచే గ్రౌండ్ వర్క్ షురూ అయింది. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటేసేందుకు యువత, ఉద్యోగులు, వృద్ధులు భారీగా క్యూకట్టారు. ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లిన యూత్ అంతా పిఠాపురానికి తరలివచ్చింది. వారికి ప్రయాణ ఖర్చులు తడిసి మోపె డైనా, టిక్కెట్లు దొరక్కపోయినా స్వస్థలాలకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చి ఓటేయడానికి మొగ్గు చూపని వారు సైతం ఈసారి హాజరయ్యారు. మరోవైపు మెగా ఫ్యామిలీ, సినీ, బుల్లితెర నటులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది. దీంతో పవన్‌కల్యాణ్ గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు జనసైనికులు, పవన్ ఫ్యాన్స్. మరి వారంతా ఊహిస్తున్నట్టు జనసేనాని విజయ కేతనం ఎగురవేస్తారా..? లేదంటే అధికార పార్టీ నేతలు చెబుతున్నట్టు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే ఓటింగ్ శాతం పెరిగిందా..? వంగా గీత గెలుపు ఖాయమా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. మరి ఏది నిజమన్నది తెలియాలంటే జూన్ 4న ఫలితాల విడుదల వరకూ వేచి చూడాల్సిందే.


