త్వరలోనే వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ ప్రజల్లోకి రాబోతున్నారా? ఆ దిశగా ఇప్పటికే తనను కలిసిన పార్టీ నేతలకు సంకేతాలిచ్చారా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తోంది. ఫిర్యాదులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేడర్‌లో, నాయకుల్లో మనో స్థైర్యం నింపేందుకు వైసీపీ అధినేతే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ప్రలోభాలకు లొంగవద్దు. కేసులు పెట్టినా భయపడొద్దు. శాసనసభలో కట్టడి చేసినా, మండలిలో మాత్రం గట్టిగా ప్రభావం చూపండి. అంటూ వైసీపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్ జగన్.
శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో సమావేశమవు తున్నారు జగన్. ఈ క్రమంలోనే పలువురు గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు జగన్‌తో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగానే వారితో పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్ జగన్. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరన్న ఆయన మహా అయితే నాలుగు కేసులు పెడతారంటూ వ్యాఖ్యానించారు. అంతకుమించి వాళ్లేం చేయగలుగుతారని నేతల ముందు కామెంట్ చేశారు జగన్. ఈ సందర్భంగానే గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మరోసారి గుర్తు చేశారు వైసీపీ అధినేత మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 99 శాతం వాగ్దానాలను అమలు చేశామన్న ఆయన గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణ లను అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2024 నుంచి 2029 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయన్న ఆయన. సినిమాలో ఫస్టాఫ్ మాత్రమే అయ్యిందన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎలా పైకి లేచామో గుర్తు చేసుకోవాలని నేతల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా దిశానిర్దేశం చేశారు.
మరోవైపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ సానుభూతిపరులు, శ్రేణులపై దాడులు జరుగుతు న్నాయని ఇప్పటికే ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించు కోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపైనా నేతలు జగన్‌తో చర్చిం చారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు ఆయా అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులను పరామర్శిం చాలని సూత్రప్రాయంగా జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పట్నుంచి వై.ఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఎక్కడ్నుంచి పరామర్శ మొదలు పెడతారు అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తంగా రాబోయో రోజుల్లో కూటమి పాపాలు పండుతాయని, అప్పటివరకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్.


