పేదరికం సంకెళ్లను తెచ్చే అస్త్రం చదువు ఒక్కటేనని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లా నార్సలలో జగనన్న వసతి దీవెన నిధులను విడుదల చేశారు. అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ దాదాపు 9లక్షల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లను నేరుగా జమ చేస్తున్నామని తెలిపారు. పిల్లల చదువుల కోసంఏ ఒక్కరూ అప్పు చేయకూడదన్నదే ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొచ్చామన్నారు. ఐటీఐ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.20వేలు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వచ్చీరాని ఇంగ్లీష్ భాషలో రిపబ్లిక్ టీవీకి ఓ ముసలాయన ఇంటర్వ్యూ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఆయన మాటలు వింటుంటే తనకు పంచతంత్రం కథ గుర్తుకొచ్చిందని చెప్పారు. నరమాంసపు పులి వృద్ధాప్యంలో మాంసం తినడం మానేశానని అబద్ధాలు చెబుతూ మనుషులను నమ్మించాలని ప్రయత్నిస్తోందని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అబద్ధాలు చెప్పే వారిని, వెన్నుపోటు పొడిచే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలకు జగన్ సూచించారు.