వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు. జగన్ 2.0 అంటే 11 సీట్లు కూడా రావన్నారు. జగన్ ఓడిపోయి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారని అన్నారు. జగన్ పాలన చూసి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని.. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడాలని సూచించారు. జగన్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే సంతోషంగా ఉన్నారని బుద్ధా వెంకన్న ఫైరయ్యారు.
ఇంకా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ” ప్రజలు జగన్ కు ఓటేస్తే.. పశుపతికి ఓటు వేసినట్టేనని భావించారు. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని సంతృప్తిగా ఉన్నారు. జగన్ ఓటమిపాలై ఏడాది కాలేదు.. అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారు. 8 నెలల తర్వాత జగన్ నిద్రలేచి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. గత ఐదేళ్లు నేరస్తులతో పాలన చేశారు. ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు.
30 సంవత్సరాలు నేనే సీఎం అని భ్రమలో ఉన్నారు. జగన్‌ని మానసిక వైద్య నిపుణులకు చూపించాల్సిందిగా ఆయన భార్య భారతిని కోరుతున్నాము. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరుతాం. జగన్ మాటలకు వైసీపీ నేతలే విస్తుపోతున్నారు. అధికారంలో ఉండగా కార్యకర్తలను గౌరవించలేదు. జగన్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తప్ప ఎవరూ సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరి భూమి అయినా కబ్జాకు గురైందా..?
జగన్ హయాంలో రాష్ట్రమంతా కబ్జాలే. చంద్రబాబును నిద్ర లేపితే చంద్రముఖిని లేపినట్టే అని మాట్లాడుతున్న జగన్‌ను ప్రజలు తరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలి. జగన్ పాలనలో అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తారు, మీలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయరు. జగన్ 2.0 అంటే.. 11 సీట్లు కూడా రావు”.. అని బుద్ధా వెంకన్న అన్నారు.