స్వతంత్ర వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో వరుసగా మూడు రోజులు ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలు ముగిశాయి. ఎమ్మెల్యేకు చెందిన కంపెనీలు, వాటి ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించినట్లు సమాచారం. తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంపై పైళ్ల శేఖర్‌రెడ్డి స్పందించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. తన నివాసానికి వచ్చిన గంటన్నరలోపే అధికారులకు అన్ని వివరాలు అందజేశామని, అయినా మూడు రోజుల పాటు హంగామా చేశారని విమర్శించారు. ఏదో ఊహించుకుని వచ్చిన అధికారులకు తన ఇంట్లో ఏమీ దొరకలేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు. తనకు రియల్ ఎస్టేట్, డెవలపింగ్ తప్ప వేరే ఏ వ్యాపారాలు లేవని ఎమ్మెల్యే చెప్పారు. తాను కొన్న ఆస్తుల వివరాలను అడగడంతో పాటు బ్యాంక్ లాకర్లను తెరిపించి చూశారని చెప్పారు. మంగళవారం విచారణకు రమ్మంటూ పైళ్ల శేఖర్ రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
వనితా రెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అనధికారిక వర్గాల సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను తెరిపించి పరిశీలించారని, కీలక డాక్యుమెంట్లతో పాటు విలువైన ఆభరణాలను అధికారులు గుర్తించారని ప్రచారం జరుగుతోంది.


