స్వతంత్ర వెబ్ డెస్క్: మీటీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసకు తెరపడడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రమంతి ఇంటిపై దాడిచేసిన ఆందోళనకారులు తాజాగా ఇంఫాల్‌లోని విదేశాంగశాఖ సహాయమంత్రి ఆర్‌కే రంజన్‌సింగ్ ఇంటిని ధ్వంసం చేశారు. ఇక శుక్రవారం రాత్రి క్వక్తా, కాంగ్వై ప్రాంతాల్లో ఘర్షణ జరిగింది. దాంతో శనివారం తెల్లవారుజామువరకు చెదురుమదురు కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. నిరసనకారులు భారీ సంఖ్యలో గుంపుగా ఏర్పడటం, విధ్వంసానికి యత్నించడం వంటి పలు ఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. స్థానిక అడ్వాన్స్ హాస్పిటల్ సమీపంలోని ప్యాలెస్ కాంపౌండ్ వద్ద ఒక మూక నిప్పంటించడానికి ప్రయత్నించింది. ఆ మూకలో దాదాపు వెయ్యిమంది వరకు ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి.
అలాగే మరో 300 నుంచి 400 మంది గుంపుగా వచ్చి ఇంఫాల్ సమీపంలోని ఇరింగ్‌బామ్ పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలను లూటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. అక్కడి వారికి ఎలాంటి ఆయుధాలు లభ్యం కాలేదు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలి ఇంటివద్ద, భాజపా కార్యాలయం వద్ద నిరసనకారులు ఈ తరహాలోనే విధ్వంసం సృష్టించాలని చూశారని అధికారులు తెలిపారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ దాడుల్ని భగ్నం చేస్తున్నాయి. అలాగే ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అర్ధరాత్రి వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అత్యున్నత స్థాయిలో తక్షణ చర్యలు అవసరం’ అని రిటైర్డ్ ఆర్మీ చీఫ్ వి.పి.మాలిక్ ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.