స్వతంత్ర వెబ్ డెస్క్: జాబిల్లి రహస్యాలను శోధించే క్రమంలో భారత్ చంద్రయాన్ పరంపరలో మూడో ప్రయోగానికి సిద్ధమైంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ కీలక ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం వేదికగా నిలుస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేటలోని గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మ దేవతకు సోమనాథ్ ప్రత్యేక పూజలు జరిపారు. రేపు (శుక్రవారం) చేపట్టనున్న చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలంటూ అమ్మవారిని ప్రార్థించారు. గురువారం మధ్యాహ్నం 1:05 నిముషాలకు చంద్రయాన్-3కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 2-35 గంటలకు చంద్రయాన్-3 రాకేట్ ప్రయోగం నిర్వహించనున్నారు. చంద్రయాన్-1, చంద్రయాన్-2లకు భిన్నంగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చంద్రయాన్-3 ప్రయోగం నిర్వహించనున్నారు.
అలాగే తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. శుక్రవారం చంద్రయాన్-3 రాకెట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రయోగం విజయవంతం కావాలని శ్రీనివాసుని మొక్కుకున్నారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, వీరముక్తివేల్, కల్పన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాకెట్ నమూనాను స్వామివారి పాదాలవద్ద ఉంచి ఆశీర్వాదం పొందారు. శాస్త్రవేత్తలకు ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి.. తీర్థ, ప్రసాదాలు అందజేశారు.