పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ ఫెయిలయినట్టేనా..!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సీజ్ ది షిప్ అంటూ ఆ మధ్య హల్ చల్ చేశారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని భావించినా దాన్ని పకడ్బందీగా అమలు చేయలేకపోయారని తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. మరోసారి రేషన్ బియ్యం పట్టుబడడంతో పవన్ కళ్యాణ్ పనితీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
పవన్ కళ్యాణ్ స్వయంగా జోక్యం చేసుకుని పేదలకు అందాల్సిన బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని భావించారు. మూడు వారాల పాటు విదేశీ నౌకను కాకినాడ పోర్టులో నిలిపివేసినా బియ్యం అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు. తిరిగి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మొదలవడంతో అధికారుల నిర్లక్ష్యం వైఖరి తేటతెల్లమవుతోంది.
తాజాగా కాకినాడలో మరొకసారి రేషన్ బియ్యం కలకలం రేపింది. పోర్టుకు సమీపంలో బాంబే కాటా దగ్గర రేషన్ రైస్ తో వెళ్తున్న నాలుగు లారీలను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తనిఖీలు చేశారు. వీటిల్లో 92 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. ఇతర దేశాలకి ఎగుమతి చేయడానికి తీసుకుని వచ్చిన మొత్తం 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. 6Aకింద కేసులు నమోదు చేసి స్టాక్ ను గోడౌన్లకు తరలించారు.
రేషన్ బియ్యం తరలింపుపై కేసు నమోదు చేశామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. రేషన్ బియ్యాన్ని గోడౌన్ కి తరలించినట్టు చెప్పారు.
అయితే ఇదంతా ఈనెల 21న జరిగింది. ఇప్పుడిదే అనుమానాలకు తావిస్తోంది. ఈనెల 21న అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే 23వ తేదీన బయటపెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని అధికారులే ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఇలా చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది.
ఈ వ్యవహారం కాకినాడ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమైంది. స్వయంగా డిప్యూటీ సీఎం రంగంలోకి దిగి సీజ్ ది షిప్ అని చెప్పినా కూడా బియ్యం అక్రమ రవాణా ఆగలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ రవాణా వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉండొచ్చని.. అందుకే ఆలస్యంగా వివరాలు వెల్లడించారని విమర్శలు వినిపిస్తున్నాయి.