28.2 C
Hyderabad
Tuesday, May 28, 2024
spot_img

బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టడం పక్కానా ?

    ఎన్నికలంటేనే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు. ప్రత్యర్థి ఒక ఎత్తు వేసే లోపుగానే మనం దాన్ని తిప్పికొట్టేలాగా అంతకు మించిన ఎత్తు వేయాల్సి ఉంటుంది. అలా చూస్తే.. ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయం అమలు చేసే ఎన్నికల ప్రణాళికలను, వ్యూహాలను అర్థం చేసుకోవడం ఇప్పుడు ప్రత్యర్థులకు శక్తికి మించిన పనిలా మారుతోందా ? అంటే అవునన్న వాదన విన్పిస్తోంది.

     పార్లమెంటు ఎన్నికలకు సమర శంఖం మోగించిన ప్రధాని మోడీ.. ప్రభుత్వ పరంగా అభివృద్ధి అజెండాతో ముందుకెళుతున్నారు. అదే సమయంలో పార్టీ తరఫున ప్రత్యర్థులు ఊహించని ఎత్తులు వేస్తూ వారిని చిత్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయబోయే 195 మంది అభ్యర్థులతో కమలనాథులు తొలి జాబితా విడుదల చేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే తొలి విడతలో విడుదల చేసిన అభ్యర్థుల సంఖ్య ఇప్పుడే ఎక్కువ. ఓవైపు ప్రత్యర్థి ఇండియా కూటమి పొత్తుల వ్యవహారంలో నానా తిప్పలు పడుతుంటే.. కాషాయ పార్టీ మాత్రం మోడీ, షా ఆధ్వర్యంలో పరుగులు తీస్తోంది. జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నా.. చక్రం తిప్పేది మొత్తం మోడీ-షా ద్వయమేనని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇందులో భాగంగానే ప్రత్యర్థులకు ఏమాత్రం అందని రీతిలో ఏకంగా 195 మంది అభ్యర్థుల్ని ప్రకటించి ఆశ్చర్యపోయేలా చేసింది బీజేపీ. ఇందులో ప్రధాని మోడీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర కేబినెట్‌లో 34 మంది తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇద్దరు మాజీ సీఎంలకూ టికెట్లిచ్చారు.

     నిజానికి.. 2004 ఎన్నికలకు ముందు బీజేపీపై ఆరెస్సెస్ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఏదైనా ఒక కీలక నిర్ణయం పార్టీ పరంగా తీసుకోవాలంటే నాటి బీజేపీ అధ్యక్షులు కచ్చితంగా సంఘ్‌ నేతలతో చర్చించాల్సిన పరిస్థితులు. ఇంకా చెప్పాలంటే వారి నుంచి అనమతి తీసుకోవాల్సిన పరిస్థితులు కన్పించేవి. కానీ, మోడీ హవా మొదలైన తర్వాత మెల్లగా పార్టీపై సంఘ్‌ ప్రభావం తగ్గడం మొదలైంది. 2014లో ఓ మోస్తరుగా కన్పించినా, ఆ తర్వాత 2019లో మాత్రం మోడీ హవా పూర్తిగా నడిచింది. ఇక, ఇప్పుడు మోడీ మాటకు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో ఎదురు చెప్పే పరిస్థితి లేనే లేదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే మోడీ-షా ద్వయం ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా ఒకేసారి 195 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. అందులోనూ 28 మంది మహిళలు, 57 మంది ఓబీసీలు, 27 మంది ఎస్సీలు, 18 మంది ఎస్టీలకు స్థానం కల్పించారు. 47 స్థానాల్లో 50 ఏళ్లలోపు వారు మాత్రమే పోటీ చేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూనే యువతకు ప్రాధాన్యం కల్పించారు మోడీ-షాలు.

    ఇక, ప్రభుత్వ పరంగా చూస్తే.. గత నాలుగున్నరేళ్లలో ఒక్క అవినీతి మరక లేకపోవడం మోడీ ప్రభుత్వా నికి ప్లస్‌గా మారిందంటున్నారు కమలనాథులు. వివిధ వర్గాల్లో మోడీ పాలన పట్ల, విధానాల విషయంలో సానుకూల దృక్పథం నెలకొందని అంటున్నారు. అందుకు తగినట్లుగానే దేశంలో ఎక్కడ చూసినా బీజేపీ కి సానుకూల పరిస్థితులు కన్పిస్తున్నాయన్న వాదన స్వయంగా ప్రధాని సైతం పార్లమెంటు వేదికగా ప్రస్తావించారు. అంతేకాదు.. మరో అడుగు ముందుకేసిన ఆయన.. కాషాయ పార్టీ ఒంటరిగానే 370 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు గ్యారెంటీ అని పార్లమెంటు వేదికగా ప్రకటించి సంచలనం సృష్టించారు.

    ప్రధాని మోడీ.. ఈ వ్యాఖ్యలు చేయడంపై రెండు రకాల వాదనలు విన్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తించేందుకు, మరింత జోష్‌తో ఎలక్షన్లలో పనిచేసే ఉద్దేశంతోనే ఆయన ఇలా మాట్లాడారాన్న వాదన విన్పిస్తోంది. మరోటి.. 2014 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 282 సీట్లు సాధించింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎలక్షన్లలో 303 సీట్లను ఒడిసి పట్టింది. అంటే.. ప్రధాని మోడీ పాలనలో బీజేపీ పార్టీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ పోతోంది. పార్టీ పరంగా ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం ఒకదాని వెంట మరోటిగా అన్నట్లు అమలు చేయడం.. విపరీతమైన మైలేజ్ తెచ్చిపెడుతోంది. అలా చూస్తే.. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాఖ్‌, అయోధ్యలో రామ మందిరం… ఇలా ప్రధానమైన అంశాల విషయంలో ఎన్డీఏ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై సానుకూల ధోరణి నెలకొందన్న అభిప్రాయం మెజార్టీ వర్గాల్లో విన్పిస్తోంది. దీంతో.. మళ్లీ హ్యాట్రిక్ పక్కా అని ప్రధాని సైతం వ్యాఖ్యానించారన్న వాదన విన్పి స్తోంది.

Latest Articles

ఆ ప్రశ్నకు ‘ల‌వ్‌, మౌళి’లో సమాధానం దొరుకుతుంది: నవదీప్

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్