19.2 C
Hyderabad
Friday, January 24, 2025
spot_img

బీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందా?

నువ్వా-నేనా అన్నట్లుగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికలు చివరి దశకు చేరుకోవడంతో అభ్యర్థులంతా గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో చెమటోడుస్తున్నారు. అయితే… ఇప్పటివరకు మరోసారి విజయం మాదేనని, హ్యాట్రిక్ ఖాయమని చెప్పుకొచ్చిన అధికార బీఆర్‌ఎస్‌లో ఓటమి భయం మొదలైందా అన్న సందేహాలు విన్పిస్తున్నాయి. ఓవైపు పలు సర్వేల్లో ప్రతికూల ఫలితాలు రావడం, నిఘా వర్గాల నివేదికలు సైతం వ్యతిరేకంగా ఉండడం ఇప్పటికే కారు పార్టీని కలవరపెడుతున్నాయన్న వాదన విన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు నేతలు స్వయంగా మాట్లాడుతున్న మాటలే నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇతర నేతల సంగతి కాస్త పక్కన పెడితే ప్రధానంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ గెలుపుపైనే గులాబీ పార్టీలో గుబులు మొదలైందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2009 నుంచి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న కేటీఆర్‌కు ఈసారి నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందన్న ప్రచారం జోరుగా సాగడమే ఇందుకు నిదర్శనం. ఇదే అంశంపై పార్టీ కార్యకర్తలు, నాయకులు కొందరితో కేటీఆర్ మాట్లాడారని చెబుతున్న ఫోన్ సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. సొంత నియోజకవర్గంలోనే ప్రచారానికి వెళ్లేందుకు నేతలు వెనుకాడే పరిస్థితి వచ్చిందని ఈ విషయంలో కేటీఆర్ వాళ్లకు నచ్చచెబుతూ బ్రతిమాలే పరిస్థితి రావడమే ఇందుకు తిరుగులేని సాక్ష్యమంటున్నారు హస్తం పార్టీ నేతలు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియోలో ఉన్న విషయాల్ని ఒకసారి వింటే… ఎన్నికల ప్రచారానికి సరిగ్గా వారం రోజులే మిగిలి ఉన్నందున ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలంటూ కేటీఆర్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. బయటివాళ్లు మాట్లాడే మాటల్ని పట్టించుకోవాల్సిన పని లేదని ఓవైపు చెబుతూనే మనవాళ్లే పది రకాలుగా మాట్లాడుకోవడం మంచిది కాదని..దయచేసి ఏ ఊళ్లో వాళ్లు అక్కడే పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

కేవలం ఇవే కాదు..సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని.. కేటీఆర్‌ను ఓటమి భయం వెంటాడుతోంది..అని చెప్పేందుకు ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలే సాక్ష్యం అంటున్నాయి విపక్షాలు. గతంలో మాదిరిగా కాకుండా తాను వారానికి రెండు రోజులు సిరిసిల్లకు వస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని, పాత విషయాలన్నీ మర్చిపోవాలని ఆయన నాయకులతో చెబుతున్న మాటలే ఇందుకు నిదర్శనం అంటున్నాయి.

ఈ ఆడియో నిజంగా కేటీఆర్ మాట్లాడిందా లేక ఫేకా అన్నది తెలియాల్సి ఉంది. అయితే.. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం మండిపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపు కచ్చితంగా కేటీఆర్‌దేనని ఢంకా బజాయిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో 171 ఓట్లతో ప్రత్యర్థిపై గెలిచిన కేటీఆర్.. ఆ తర్వాత ప్రతి ఎన్నికలో మెజార్టీ పెంచుకుంటూ పోయారు. 2018లో ఏకంగా 89 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. అదే సమయంలో విపక్షాల మాత్రం అంత సీన్ లేదంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారం మారేది ఖాయమని చెబుతున్నాయి. మరి..ఈ విషయంలో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఈనెల 30న తేలిపోనుంది.

Latest Articles

విశాఖ ఉక్కు పరిశ్రమపై భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌ ప్రకటిస్తే కొందరు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్