విశాఖే పరిపాలనా రాజధాని అంటూ చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలను కేటాయించినట్లు ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం 2 లక్షలా 27 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. అంతే కాదు, కార్యాలయాలు, విడిది అవసరాలకు సైతం భవనాలను కేటాయించింది. ఆంధ్రా యూనివర్సిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలోని భవనాలను అలాట్ చేసినట్లు ఉత్తర్వుల్లో పొందు పరిచారు. ఇక, పలు శాఖలకు ఎండాడ, హనుమంతవాకలో ఇచ్చారు.
భవనాలు కేటాయించిన శాఖల విషయానికి వస్తే.. జీఏడీ, ఆర్థిక, గ్రామ వార్డు సచివాలయ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలను కేటాయించారు. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే..సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడనేది ఈ జీవోలో మాత్రం వెల్లడించలేదు ఏపీ ప్రభుత్వం.