నీట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎంబీ బీఎస్, బీడీఎస్ ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ను సవాల్ చేస్తూ మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు వినింది. అనంతరం కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని NTA పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 1560 మంది అభ్యర్థుల ర్యాంకులపై పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో 1560 మంది ర్యాంకులను నిలిపివేశామని NTA కోర్టుకు తెలిపింది. తిరిగి విద్యార్థులకు పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నామని కోర్టుకు తెలిపింది.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలపై అబ్లుల్లా మహమ్మద్ ఫైజ్, కార్తీక్ వేర్వేరు పిటిషన్లు వేశారు. వీరితో పాటు నీట్ పరీక్షలో కొంత మందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 1500 మంది విద్యార్థు లకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు ఇచ్చారని, ఇలా ఏకపక్షంగా మార్కులు ఇవ్వడాన్ని తాము సవాల్ చేస్తున్నట్లు ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రేస్ మార్కులివ్వడం ఏకపక్షమని, నీట్ పరీక్షా ప్రక్రియ, ఫలితాలపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4 వేల 750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కు లు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఆరోపిస్తూ ఢిల్లీలో ఈ నెల 10న విద్యార్థులు ఆందోళన చేశారు. సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న ఢిల్లీ హైకోర్టులోనూ నీట్ పిటిషన్లపై విచారణ జరిగింది.