పారిస్ ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన మను.. తాజాగా మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ సత్తాచాటారు. తన టీమ్ మేట్ సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భారత్‌కు మరో కాంస్య పతకాన్ని అందించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మనూబాకర్ జోడీ… దక్షిణ కొరియాతో పోటీ పడి మరీ కాంస్యాన్ని సాధించారు. మను బాకర్ జోడీ 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియాకు చెందిన లీ, యోజిన్ జట్టు 10 పాయింట్లు సాధించింది. దీంతో.. కాంస్య పతకం లభించింది.
ఈ ఘనతతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది మను బాకర్. మన దేశం బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటీష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్‌లో రెండు రజత పతకాలు సాధించారు. పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటిన మను సొంత రాష్ట్రం హరియాణా. బాక్సర్లు, రెజ్లర్లకు ప్రసిద్ధి చెందిన హరియాణాలో ఫిబ్రవరి 18, 2002న మను జన్మించారు. పాఠశాల విద్య సమయంలో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్‌లో రాణించిన మను, ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం సంపాదించారు. ఆయా విభాగాల్లో పతకాలు సాధించారు.
14 ఏళ్ల వయసులో అనూహ్యంగా షూటింగ్‌ను ఎంచుకుంది మను. ఈ క్రమంలోనే విపరీతంగా సాధన చేసిన ఆమె.. 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్స్‌లో రజతం సాధించారు. అదే మనుబాకర్ తొలిసారి అందుకున్న అంతర్జాతీయ పతకం. 2017లో కేరళలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు సాధించింది. ప్రపంచ మాజీ నెంబర్ వన్ హీనా సిద్ధూను సైతం ఓడించింది మను. ఆస్ట్రేలియాలో జరిగిన 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 2018లో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశ ఎదురైనా పట్టు వదలకుండా సాధన చేసి పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు ఒడిసిపట్టింది మను. .యావత్ దేశం గర్వించేలా చేసింది.