తాజాగా కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులున్నారు.ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఈ విషయం వెల్లడించింది. మృతిచెందినవారిలో తామాడ లోకనాథం, సత్యనారాయణ, మీసాల ఈశ్వరుడు ఉన్నారు. వీరిలో తామాడ లోకనాథం శ్రీకాకుళం జిల్లా వాసి. సోంపేట మండలం జింకిభద్ర గ్రామం తామాడ లోకనాథం స్వస్థలం.కాగా మరో మృతుడు సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా వాసి. పెరవలి మండలం ఖండవల్లి సత్యనారా యణ స్వగ్రామం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు కూడా చనిపోయారు. వీరి మృతదేహాలకు వారి స్వస్థలాలకు పంపడానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏర్పాట్లు చేసింది.
కువైట్ అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పొట్ట చేత పట్టుకుని ఎక్కడో ఉన్న కువైట్ వెళ్లిన తమ వాళ్లు విగత జీవులుగా తిరిగి రావడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. కాగా తామాడ లోకనాథం ఈనెల 11న అగ్నిప్రమాదం సంభవించిన భవంతిలోకి వెళ్లారు. అప్పటికి ఆయన ఎక్కడా పనిలో కుదురుకోలేదు. తెల్లవారితే ఉద్యోగంలో చేరాదమ నుకున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. జూన్ 13న ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో లోకనాథం విమాన టికెట్, ఇతర వివరాలు చెప్పి కంపెనీలో వాకబు చేశారు. దీంతో అగ్ని ప్రమాదంలో లోకనాథం మరణించిన సంగతి బయటకు వచ్చింది.
ఇక్కడ కేరళకు చెందిన నళినాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నళినాక్షన్ మూడో అంతస్తులో ఉన్నాడు. మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ప్రాణం కాపాడుకోవడానికి మూడో అంతస్తు నుంచి నళినాక్షన్ కింద ఉన్న వాటర్ ట్యాంక్‌లోకి దూకాడు. దీంతో అంత ఎత్తు నుంచి దూకడంతో నళినాక్షన్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్క టెముకలు విరిగిపోయాయి. అయితే ప్రాణాపాయం తప్పింది. ప్రాణాలు దక్కించుకున్న నళినాక్షన్ ది కాసర్‌గోడ్ జిల్లాలోని త్రిక్కరిపూర్ గ్రామం. నళినాక్షన్ 58 ఏళ్ల వృద్ధుడు. గత పన్నెండు సంవత్సరాలుగా నళినాక్షన్ కేరళలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కేరళకు చెందిన వ్యాపారవేత్త కేజీ అబ్రహం యాజమాన్యంలోని ఓ కంపెనీలో పీఆర్వో గా నళి నాక్షన్ పనిచేస్తున్నారు. ఏమైనా ప్రాణాపాయం తప్పడంతో నళినాక్షన్ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. వీరిలో ముగ్గురు తెలుగువారు కాగా 24 మంది కేరళవాసులు. ఏడుగురు తమిళనాడు వాసులు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. కాగా మృతుల కుటుంబసభ్యులకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా వ్యాపార వేత్తలైన లులు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ ఐదు లక్షల రూపాయల చొప్పున అలాగే రవి పిళ్లై రెండు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇస్తామన్నారు. భారత్ నుంచి ప్రతి ఏడాది వేలాది మంది కార్మికులు బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. ఈ గల్ఫ్ దేశాలలో కువైట్ ఒకటి. మిగతా గల్ఫ్ దేశాలతో పోలిస్తే కువైట్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వేతనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో కువైట్ కు వెళ్లడానికి భారతీయ కార్మికులు ఆసక్తి చూపుతుంటారు.
కువైట్‌లో లక్షలాదిమంది భారతీయ కార్మికులున్నారు. ప్రధానంగా కేరళ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ కు చెందిన కార్మికులు ఇక్కడ ఉంటున్నారు. కువైట్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువ. ఎక్కడో ఒక చోట ఉద్యోగం దొరకడం పెద్ద కష్టం ఏమీ కాదు. దీంతో లక్షలు ఖర్చు పెట్టి వీసా తెచ్చుకుని కువైట్ వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు భారతీయ కార్మికులు. దాదాపు నాలుగేళ్ల కిందట భారతీ యులు పెద్ద సంఖ్యలో ఉన్న విషయాన్ని కువైట్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో దేశ జనాభాలో పెరిగిపో తున్న విదేశీయులను తగ్గించుకోవడానికి కువైట్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కువైట్ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. దీంతో దాదాపు ఎనిమిది లక్షల మంది భారతీయులు తప్పనిసరిగా కువైట్ దేశం వదలిపెట్టి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కువైట్ లో తెలంగాణకు చెందిన కార్మికులు వేలాది సంఖ్యలో ఉన్నారు. అయితే వీసా గడువు ముగిసిన తరువాత కూడా అక్కడే ఉంటున్నారన్న సాకును అడ్డం పెట్టుకుని తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులను జైళ్లలో పెట్టింది కువైట్ ప్రభుత్వం. అయితే భారత ప్రభుత్వం ఈ విషయంలో స్పందిం చింది.కువైట్ పాలకులతో స్పందిం చింది. ఈ సంప్రదింపులు, చర్చల ఫలితంగా వీసా గడువు ముగిసిన తరువాత కూడా అక్కడే ఉంటున్న తెలంగాణ కార్మికులకు కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. దీంతో నానా కష్టాలు పడ్డ తెలంగాణ కార్మికులు కువైట్ చెరసాలల నుంచి బయటపడి స్వస్థలాలకు చేరుకున్నారు. వీసాల సంగతి ఎలాగున్నా, ఇప్పటికీ కువైట్‌కు భారతీయులు క్యూ కడుతు న్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇబ్బడి మబ్బడిగా ఉపాధి అవకాశాలు ఉండటమే. సహజంగా భారతీయు లకు కష్టపడే స్వభావం ఎక్కువ. ఏ ఉద్యోగం ఇచ్చినా, ఏ పని అప్పగించినా, శ్రమ అనుకో కుండా డ్యూటీ సక్రమంగా చేస్తారు. ఒక్క కువైట్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు ఆ గుడ్ విల్ ఉంది. దీంతో భారతీయ కార్మికులను నియమించుకోవడానికి కువైట్‌లోని ప్రధాన కంపెనీలన్నీ ఆసక్తి చూపుతుం టాయి. కువైట్‌లో భారతీయ కార్మికులు ఎక్కువగా ఉండటానికి ఇదొక ప్రధాన కారణం.