స్వతంత్ర, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో తడబడుతున్న టీమిండియాను ఓ రికార్డు పలకరించింది. సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే పేరు మీద ఈ రికార్డు నమోదైంది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకున్న రహానే.. టెస్టుల్లో 100 క్యాచ్‌లు అందుకున్న ఏడో భారత ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. భారత మాజీ కెప్టెన్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ 209 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 205 క్యాచ్‌లతో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక ఓవల్ వేదికగా సాగుతున్న WTC తుది సమరంలో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమవుతున్నారు. అంతకుముందు బౌలింగ్ లో తేలిపోయిన రోహిత్ సేన.. బ్యాటింగ్‌లోనూ అదే ఆట తీరు కనబరుస్తోంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ప్రస్తుతం రహానే 29, శ్రీకాంత్ భరత్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.