స్వతంత్ర వెబ్ డెస్క్: జూనియర్ మహిళల ఆసియా కప్ ఫైనల్లో నాలుగుసార్లు ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియా అమ్మాయిలను భారత జూనియర్ క్రీడాకారిణులు 2-1 తేడాతో ఓడించారు. ఉమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్-2023 జపాన్‌లోని కకమిగహరలో జరిగింది. భారత్‌కు కప్ సాధించిన హాకీ జూనియర్ క్రీడాకారిణులకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటిస్తున్నట్లు హాకీ ఇండియా పేర్కొంది. అలాగే, టీమిండియాకు సహకరించిన సిబ్బందికి రూ.లక్ష చొప్పున అందిస్తామని చెప్పింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 2-1తో దక్షిణ కొరియాను ఓడించి తొలిసారి ఆసియాకప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. అదే సమయంలో సెమీ ఫైనల్‌లో విజయంతో భారత జట్టు కూడా జూనియర్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఈ ఏడాది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 వరకు చిలీలో జూనియర్ ప్రపంచకప్ జరగనుంది. భారత క్రీడాకారిణులకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. క్రికెట్‌లో ఆస్ట్రేలియాలో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడిన రోజే హాకీలో అమ్మాయిలు భారత్‌కు కప్ సాధించిపెట్టడం విశేషం.