స్వతంత్ర వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మొత్తం 8 మంది కారులో ప్రయాణిస్తుండగా.. ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఇద్దరిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించే క్రమంలో.. మరొకరు మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. హైదరాబాద్‌లో ఓ వివాహానికి హాజరై, తిరిగి రాజమండ్రి నివాసానికి చేరుకుంటున్న నేపథ్యంలో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, 8 నెలల చిన్నారి ఉన్నారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కొవ్వూరు డీఎస్పీ వర్మ తెలిపారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారు.. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వలిచేరుకి చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం వీళ్లు రాజమండ్రిలో ప్రకాష్ నగర్‌లో వద్ద నివాసం ఉంటున్నారు. మిద్దె సత్తిబాబు కారుని డ్రైవ్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతని పక్కనే మిద్దె తేజ, శ్రావణి, అరుణలు కూర్చున్నారని.. చిన్నారితో పాటు మరో ఇద్దరి పేర్లు తెలియాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఆ కుటుంబం, అక్కడ ఎంతో సంతోషంగా గడిపింది. తమ గమ్యానికి మరో 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తరుణంలో.. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబలించింది.