- భారత్‌కు ఒలింపిక్స్ నిర్వహణ కూడా తెలుసని వెల్లడి
భారత దేశం క్రీడల పరంగా వెనుకబడి ఉంటుందని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా క్రీడాకారులకు ఇక్కడ ప్రోత్సాహం తక్కువ అని చాలామంది చెప్పేమాట.. అటువంటప్పుడు ఇక్కడ క్రీడాకారులకే దిక్కులేక పోతే, క్రీడా పోటీలు నిర్వహణ ఎంతవరకు సాధ్యం అని అంటున్నారు.

కానీ ఇప్పుడు భారత్ దృష్టి ఒలింపిక్స్ మీద పడింది. ఒలింపిక్స్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 2036 ఒలింపిక్స్‌కు సంబంధించి భారత్ బిడ్ వేస్తుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జీ-20 పగ్గాలు చేపట్టిన భారత్‌కు ఒలింపిక్స్ నిర్వహణ కూడా తెలుసని ఆయన చెప్పారు. తయారీ, ఇతర రంగాలలో దూసుకుపోతున్న భారత్.. క్రీడలలో మాత్రం వెనుకబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘భారత్‌కు ఇటీవలే జీ-20 సారథ్యం దక్కింది. దీనిని భారత్ విజయవంతంగా నిర్వహించగలిగినప్పుడు ఒలింపిక్స్ నిర్వహణ కూడా కష్టమేమీ కాదు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)తో కలిసి ఆ దిశగా కృషిచేస్తాం.

వాస్తవానికి ఒలింపిక్స్ వేదికలు చాలా ముందే ఖరారు అయిపోతుంటాయి. ఇప్పటికే 2032 దాకా ఒలింపిక్స్ వేదికలు ఖరారు అయిపోయాయి. అందుచేత 2036 కోసం భారత్ పోటీ పడుతోందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తే భారత్ పేరు మార్మోగి పోవటం ఖాయం.