అహ్మదాబాద్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగవ టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట పూర్తైయ్యే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. బౌండరీలతో రెచ్చిపోయిన ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కామెరూన్ గ్రీన్ 49పరుగులు చేసి అర్థసెంచరీక ఒక్క పరుగుల దూరంలో ఉన్నాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (32), కెప్టెన్ స్టీవెన్ స్మిత్(38) పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లు మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, జడేజా చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం ఖవాజా, కామెరూన్ గ్రీన్ క్రీజులో కొనసాగుతున్నారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ(Narendra Modi) , ఆంటోనీ అల్బనీస్(Anthony Albanese) ప్రత్యేక వాహనంలో స్టేడియం అంతా తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం ఇరు జట్ల కెప్టెన్లకు క్యాప్‌లు అందచేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న 75సంవత్సరాల స్నేహానికి గుర్తుగా.. ఇరు దేశాల ప్రధానులను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సన్మానించారు.


