కోవర్టులున్నారు జాగ్రత్త
కర్నూలు జిల్లా మంత్రాలయంలో టిడిపి నేత తిక్కారెడ్డి హాట్ కామెంట్స్ చేసారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జగన్ బ్రోకర్లు ఉన్నారంటూ హెచ్చరించారు. డబ్బులకు ఆశపడి బాల నాగిరెడ్డి కోవర్టులకు టికెట్ ఇప్పించారు, ఈ విషయం లో అధిష్టానం పునరాలోచన చేయాలని కోరారు. టికెట్ విషయమై ఆధిష్టానంతో తాడో పేడో తేల్చుకుంటాన న్నారు. టిడిపి టికెట్ల దక్కించుకున్న వైసిపి కోవర్ట్ల వల్ల టీడీపీకి నష్టమే తప్ప లాభంలేదన్నారు.
మోదీతోనే సాధ్యం
మాదిగల అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం మోదీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలో పార్టమెంటు స్ధాయి మాదిగల సన్నాహక సమావేశం జరిగింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు మాదిగ ద్రోహులుగా మిగిలారని మండిపడ్డ మందకృష్ణ, ఏబీసీడీ వర్గీకరణ మోదీ నేతృత్వంలోని బీజేపీతోనే సాధ్యమన్నారు.
స్వామివారి సన్నిధిలో…
తిరుమల శ్రీవారిని ఈ ఉదయం సుప్రభాత సేవలో దర్శించుకున్నారు హీరోయిన్ అనిత. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా, టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాల అందించారు.
మండుతున్న ఎండలు
వేసవి సీజన్ ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలుగా నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అదిలాబాద్, కుమురంభీం జిల్లాల్లో మంగళవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతపై ప్రజల్ని అప్రమత్తం చేస్తూ పలు జిల్లాలకు అరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ శాఖ.
ఉల్లి కొనుగోలు
ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం పొడిగించడం వల్ల మార్కెట్లో ధర పడిపోతోందన్న రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రెండు, మూడు రోజుల్లో 5 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి అన్నదాతల ప్రయోజనాలను కాపాడతామని పేర్కొంది. 2023-24లో ఖరీఫ్, రబీ సీజన్లలో 6.4 లక్షల టన్నుల ఉల్లిని కిలో 17రూపాయల ధరతో ప్రభుత్వం సేకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
చట్టాన్ని అమలుపర్చండి
నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ చట్టాన్నిఅమలు చేయాలి నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షుడు జాన్ మస్కు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఉమ్మడి రాష్ట్ర సీఎం గా ఉన్న నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో తెచ్చిన ఈ జీవో పై కొందరు బిషప్‌లు అడ్డుచెప్పడాన్ని ప్రస్తావించిన జాన్ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆకస్మిక తనిఖీ
మధురానగర్ పోలీస్ స్టేషన్ ని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. పెండింగ్‌లో ఉన్న పలు కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ సీఐ తీరుపై పలు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో సీపీ ఈ తనిఖీలు నిర్వహించడం చర్చకు దారితీసింది. పలు కేసుల్లో సీఐ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలే ఈ తనిఖీలకు కారణంగా తెలుస్తోంది.
సినీ ఫక్కీలో…
కారులో గంజాయి పెట్టి ప్రత్యర్ధిని కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన నలుగురు వ్యక్తులపై వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులు కేసు నమోదు చేసారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిగి డిఎస్పీ కరుణసాగర్‌రెడ్డి మీడి యాకు వివరించారు. నిందితులు నలుగురిపై NDPS ACT కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సులు ఢీ
కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఇరు వాహనాల డ్రైవర్లు అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. గాయపడ్డ డ్రైవర్‌ను చికిత్సకై ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కూతుళ్ల ఆదర్శం
ఆడిపిల్లలే అని అందరూ హేళన చేసిన కృంగకుండా అందర్నీ ఉన్నత చదువులు చదివించాడు బీహార్ రాష్ట్రానికి చెందిన కమల్‌సింగ్. వ్యవసాయం చేసుకొంటూ భార్య శారదాదేవితో కల్సి పిండి గిర్నీ నడిపాడు. ఇప్పుడు ఆ ఏడుగు రు కూతుళ్లు బీహార్ పోలీసు, అబ్కారీ, కేంద్ర సాయుధ బలగాల్లో స్ధిరపడ్డారు. ఒక్కగానొక్క తమ్ముడు రాజీవ్సింగ్కు ఛప్రాలోని ఎక్మా బజార్లో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించి కానుకగా ఇచ్చారు. ప్రతీ నెలా వచ్చే అద్దెలతో హాయిగా ఉన్నట్లు కమల్‌సింగ్, శారదాదేవి దంపతులు సంతోషం వ్యక్తం చేసారు.
లంచ్ బెల్ ప్రాజెక్ట్
కేరళలో డ్వాక్రా మహిళలు ప్రారంభించిన కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్టుకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈనెల 5న తిరువనంతపురంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ఆ మరుసతి రోజు నుంచే తన సేవలను ఆరంభించింది. ఆర్డర్ల కోసం పాకెట్ మార్ట్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చి తక్కువ ధరకు ఇంటికే లంచ్ బాక్స్ అందిస్తోంది. శాకాహార భోజనానికి 60, మాంసాహారానికి 90 రూపాయలుగా ధరను నిర్ణయించారు ప్రాజెక్టు నిర్వాహకులు.
ఎక్స్ నుంచి కొత్త ఫీచర్
ప్రీమియం సబ్‌స్ర్కైబర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది సామాజిక మాధ్యమం ఎక్స్. ఎక్స్ ఏ ఐ కృత్రిమ మేధ సంస్ధ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్‌ను వచ్చేవారం అందిస్తున్నట్లు ఎలెన్ మస్క్ వెల్లడిం చారు. ఇప్పటివరకు ఇది కేవలం ప్రీమియం ప్లస్ సబ్‌స్ర్కైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
యూనివర్సిటీకి రూ.500 కోట్లు
హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీకి 5 వందల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించింది మహీంద్రా గ్రూప్. ఈమేరకు గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ నిధులతో వచ్చే అయిదేళ్లలో కొత్త విభాగాల్లో కోర్సులు ప్రారంభించనుంది, మహీంద్రా యూనివర్సిటీని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది.
తొలి సౌదీ యువతి
మెక్సికో వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న 73వ మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా తొలిసారి భాగస్వా మ్యం కానుంది. రియాద్‌కు చెందిన 27 ఏళ్ల రూమీ అల్కహ్తాని, ఈ పోటీల్లో అధికారికంగా పాల్గొననుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రూమీ వెల్లడించింది. అంతర్జాతీయ వేదికగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ యువతిగా నిలవనుంది రూమీ.


