స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. నెల వయసున్న చిన్నారుల నుంచి వయోవృద్దుల దాకా డెంగ్యూ బారిన పడుతున్నారు. దీంతో ఆస్పత్రులకు జనం క్యూ కడుతున్నారు. కాగా, ఇటీవల డెంగీతో ఖమ్మం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని, పేద, మధ్యతరగతికి వైద్య ఖర్చు మోయలేని భారంగా ఉందని పేర్కొన్నారు. డెంగ్యూ బారిన పడిన వారికి మెరుగైన, ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు వ్యాధి నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.