స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఈ విజన్ డాక్యుమెంటును ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. 13 ఉమ్మడి జిల్లాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరయ్యే ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం గురువారం ఏర్పాట్లను సమీక్షించింది. విద్య, మహిళా సాధికారత, సాంకేతిక రంగం, ఆరోగ్యం, వ్యవసాయం, స్వచ్ఛంద సేవా రంగాలతోపాటు ఇతర రంగాల్లోనూ విశేష సేవలు అందించిన ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకువచ్చేందుకు 500 బస్సులు సమకూర్చారు. వాహనాలు నిలిపేందుకు 24, బస్సుల కోసం ఏడు ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. పోలీసులు భారీగా బందోబస్తు చేస్తున్నారు. విజన్ డాక్యుమెంటును ప్రతిబింబించే విధంగా పది ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం కోసం శుక్రవారం విజయవాడ సహా.. వివిధ జాతీయ రహదారులపై వచ్చే వాహనాలను దారి మళ్లిస్తారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్- విజయవాడ, చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారులపై వచ్చే వాహనాలను ఉమ్మడి నల్గొండ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల వాహనాలను వేరే మార్గంలో పంపుతారు. నేడు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.