ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని అగ్రనేతలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. ఈ కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టారు. 5 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా పార్టీల నేతలు, ఆఫీస్ బేరర్ల కార్యాలయాలు ఇందిరా గాంధీ భవన్‌కి మారనున్నాయి.
ప్రస్తుతం ఉన్న అక్బర్ రోడ్ 24వ నంబర్ బంగ్లా నుంచి 9A కోట్లా రోడ్డుకి ఏఐసిసి నూతన కార్యాలయం అడ్రస్ మారనుంది. దీన్ దయాళ్ మార్గ్‌ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయ అడ్రసులో ఉంచడానికి ఆ పార్టీ ఇష్టపడటం లేదు. 2008లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. బీజేపీ సిద్ధాంత కర్తల్లో ఒకరిగా ఉన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు మీద డీడీయూ మార్గ్ ఏర్పడింది. పార్టీ కార్యాలయానికి కేటాయించిన స్థలం దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో ఉన్నప్పటికీ.. భవనం వెనుక కోట్లా రోడ్‌లోని ద్వారాన్ని మెయిన్ ఎంట్రెన్స్‌గా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
అశోకా రోడ్‌లోని తమ కార్యాలయాన్ని బీజేపీ వినియోగిస్తున్నట్లే అక్బర్ రోడ్ 24వ నంబర్ బంగ్లాలో ఉన్న తమ కార్యాలయాన్ని అలాగే కొనసాగిస్తామని అంటున్నారు. ఉన్నత స్థాయి సమావేశాలకు ఈ కార్యాలయాన్ని ఉపయోగిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
పార్టీ కార్యకర్తలు, నాయకుల సందర్శనల కోసం అక్బర్ రోడ్ 24వ నంబర్ బంగ్లా అందుబాటులో ఉండదని, ప్రత్యేక సందర్భాలలో, కీలక సమావేశాల కోసం మాత్రమే అక్బర్ రోడ్ కార్యాలయం వినియోగంలో ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
2009 నుంచి 15 ఏళ్లపాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం కొనసాగింది. 2009 డిసెంబర్‌లో కాంగ్రెస్ నూతన కార్యాలయానికి మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ శంకుస్థాపన చేశారు.
అక్బర్ రోడ్డు 24వ నెంబర్ బంగ్లా 1978 నుంచి సుమారు ఐదు దశాబ్దాల పాటు ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది.
ఎమర్జెన్సీ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి తరువాత కాంగ్రెస్ చీలిపోయి ఇందిరా గ్రూపునకు కార్యాలయం లేని సమయంలోనే అప్పటి ఎంపీ గడ్డం వెంకటస్వామి తన అధికారిక నివాసం అక్బర్ రోడ్డు 24వ నెంబర్ బంగ్లాను పార్టీకి ఇచ్చారు.
నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుంది- రాహుల్
RSS చీఫ్ మోహన్ భగవత్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర పోరాటాన్ని కించపరిచేలా మాట్లాడారని అన్నారు. బ్రిటిష్‌పై పోరాడిన వారిని భగవత్ అవమానపరిచారని ఆరోపించారు. జాతీయ జెండాకు కూడా నమస్కరించని వారు..దేశం కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. వాళ్లంతా ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశానికి కాంగ్రెస్ పార్టీ ఆత్మలాంటిదని రాహుల్ గాంధీ చెప్పారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపేది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారాయన. ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీపై పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ కొత్త ఆఫీసు ప్రారంభమైందని.. ఈ కొత్త భవనం కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుందని చెప్పారు. ఈ భవనం ప్రతీకార్యకర్తకూ చెందుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు.