కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది..? ఓ వైపున కినుక వహించిన నాయకులు, మరో వైపు శ్రీముఖాలు అందుకున్న నాయకులు. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తుండటం చర్చకు దారి తీస్తోంది. కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, మిగతా నాయకులకు మధ్య గ్యాప్ ఏర్పడినట్టుగా స్పష్టమవుతోంది. ఇటీవల కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మంత్రి వ్యతిరేకులు సమావేశం నిర్వహిచుకుని తమలోని బాధను వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్ సెగ్మెంట్ ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్‌కు డిసిప్లేనరీ యాక్షన్ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు.
షోకాజ్ నోటీస్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అంతా చక్కబడిందని భావించినప్పటికీ.. అనూహ్యంగా పార్టీ సీనియర్ నేత ఎం సత్యనారాయణ రావు 91వ జయంతి సందర్భంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం. ఎమ్మెస్సార్ అని కూడా పిలుచుకునే సీనియర్ నేత జయంతి వేడుకల్లోనూ పార్టీ నాయకుల మధ్య అభిప్రాయబేధాలు బయటపడడం గమనార్హం. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వైద్యుల అంజన్ కుమార్, మెన్నేని రోహిత్ రావు తదితరులు ఇందిరా భవన్‌లో నిర్వహించిన ఎమ్మెస్సార్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఎమ్మెస్సార్ కు నివాళులు అర్పించిన మంత్రి అక్కడి నుండి వెళ్లిపోయారు. పొన్నం ప్రభాకర్ ఇందిరా భవన్ నుండి వెళ్లిన పది పదిహేను నిమిషాల తర్వాత కరీంనగర్‌కు చెందిన మిగతా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అక్కడకు చేరుకుని ఎమ్మెస్సార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
మంత్రి వెళ్లిపోయిన తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. అక్కడి నుండి ఇందిరా చౌక్‌కు వెళ్లిన నేతలు.. అక్కడే కేక్ కట్ చేసి ఎమ్మెస్సార్ సేవలను స్మరించుకున్నారు. అయితే మంత్రి పొన్నం, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి, ఇతర నాయకులు వేర్వేరుగా నిర్వహించిన జయంతి వేడుకల్లో ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ ఉన్నారు. ఎమ్మెస్సార్ జయంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు సమాచారం అందించే విషయంలో జరిగిన తప్పిదాలను గమనించిన డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
కరీంనగర్ నియోజకవర్గ ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ పేరు ఎందుకు లేదని, దీనికి ఎవరు బాధ్యులో చెప్పాలని ఎమ్మెస్సార్ జయంతి వేడుకలకు ఆహ్వానించిన వ్యక్తిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే , పార్టీ ఇంఛార్జిలకు సముచిత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పినప్పటికీ.. ఎమ్మెస్సార్ జయంతి వేడుకల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పురుమళ్ల శ్రీనివాస్ పేరు చేర్చకపోవడానికి కారణమేంటని అని ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లిపోయే వరకు కూడా మిగతా నాయకులు ఎమ్మెస్సార్ జయంతి వేడుకల వద్దకు రాకపోవడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది మంత్రికి, ఇతర కాంగ్రెస్ నాయకులకు మధ్య ఉన్న గ్యాప్‌ను బయటపెట్టిందనే టాక్ నడుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో కీలకమైన కరీంనగర్‌లో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు బయటపడటం పార్టీ శ్రేణులను ఆందోళనలో నెట్టింది.
ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం కల్పించుకొని మంత్రి, ఇతర నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని.. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.