పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకుని, అర్ధరాత్రి ఒకటిన్నరకి బృందంతో కలిసి జ్యూరిచ్ బయల్దేరతారు. అక్కడి భారత రాయబారితో భేటీ అవుతారు. మొదటిరోజు జ్యూరిచ్‌లో 10మంది పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం హోటల్ హయత్‌లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పొరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం దావోస్ వెళ్లి… పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతారు.
రెండోరోజు సీఐఐ సెషన్‌లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ, సోలార్ ఇంపల్స్, కోకకోలా, వెల్‌స్పన్, ఎల్‌జీ, కార్ల్స్‌బర్గ్, సిస్కో, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ తదితర సంస్థల ఛైర్మన్లు, సీఈఓలతో జరిగే సమావేశానికి యూఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్‌తో కలిసి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ చర్చల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చాగోష్ఠులు, బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చే ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విధానాలను వివరిస్తారు.
మూడోరోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రోజుకు కనీసం పదికి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొని.. రాష్ట్రంలో మానవవనరులు, మౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థ నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై వివరిస్తారు. నాలుగోరోజు ఉదయం స్వదేశానికి బయల్దేరతారు.