సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. అసలు సంక్రాంతి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కోడి పందాలు. గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు సిద్దమవుతున్నారు పందెంరాయుళ్లు. కోడి పందేలకు అనుమతి లేదని అధికారులు చెబుతుంటే పిఠాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి ఎస్ వి ఎస్ వర్మ మాత్రం ఖచ్చితంగా కోడిపందాలు ఉంటాయని, కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని చెబుతూనే కోడి పందేలకు శ్రీకారం చుట్టేశారు. అక్కడితో ఆగకుండా నూతన సంవత్సర వేడుకల్లో కోడిపుంజులతో పందెం కూడా పెట్టేశారు. పిఠాపురం టిడిపి కార్యాలయం లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఏకంగా దగ్గరుండి కోడిపందాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది.
స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో ఈ పందేలు ఆర్భాటంగా ప్రారంభించేశారు. కోడి పుంజులను పట్టుకుని పందేలు వేయించారు. కోడిపందాలు అనేవి ఈనాటివి కావని, తరతరాలుగా సాంప్రదాయబద్దంగా వస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచు కోవాలంటున్నారు. కోడిపందాల పేరుతో కత్తులు కట్టుకుని పందేలకు దిగడం నేరమన్నారు. సాంప్రదాయ క్రీడగానే కోడిపందాలను చూడాలన్నారు. ఈ సంక్రాంతికి కోడిపందాలు యధావిధిగానే ఉంటాయన్నారు.