బీజేపీలో తన చేరికను అడ్డుకున్న వారికి వీడియోలో గట్టి హెచ్చరికలు చేశారు. మంగళవారం నాడు జరిగిన పరిణామాలతో తన అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారని చీకోటి చెప్పారు. అయితే, ఇదీ ఒకందుకు మంచిదేనని, ఈ ఘటనతో మన సత్తా అందరికీ తెలిసిందని అన్నారు. తన బలం మరింత పెరిగిందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తన అభిమానులను చూసి సంతోషంగా ఫీలయ్యానని చెప్పారు. మిగతా వారు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటుంటే తన అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు. అయితే, పార్టీలో చేరిక వాయిదా పడడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారని, తాను మాత్రం నిరుత్సాహపడలేదని చెప్పారు.
తనను అడ్డుకున్న వారికి తప్పకుండా సమాధానం చెబుతానని, రాబోయే రోజుల్లో మరింత దృఢంగా వస్తానని అన్నారు. జరిగిన ఘటనలతో ఎవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని అభిమానులకు సర్ది చెప్పారు. అభిమానుల కోసం తాను 24 గంటలూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. చీకోటి గుండె పెద్దదని, ఏ శక్తులు ఏంచేసినా తనను ఏం చేయలేరని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియదని చీకోటి వివరించారు. మీ రాజకీయం మీరు చేయండి.. నేనంటే ఏంటో మీకు చూపిస్తా అంటూ తన ప్రత్యర్థులను ఆయన హెచ్చరించారు.