స్వతంత్ర వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఒకేలా ఉంది. ఉత్తరాదిలో టమాటా మరింత ప్రియంగా ఉన్నాయి. రెండు రోజుల కిందట ఉత్తరాఖండ్‌లోకిలో టమాటా రూ.250కు చేరింది. ఉత్తరకాశీ జిల్లా గంగోత్రి ధామ్‌లో కిలో రూ.250లకు అమ్మినట్టు స్థానికులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాల కారణం టమాటా ధర ఒక్కసారిగా పెరిగిపోయిందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
దీంతో ఓ వ్యాపారి మొబైల్ ఫోన్లకు టమాటా ఆఫర్ ప్రకటించారు. తన సెల్‌ఫోన్ షాపులో స్మార్ట్‌ఫోన్ కొంటే.. 2 కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని విచిత్ర ఆఫర్‌ను ప్రకటించాడు. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ పట్టణంలో అశోక్ అగర్వాల్ అనే యువకుడు సెల్‌ఫోన్ దుకాణం నడుపుతున్నాడు. కొన్ని రోజులుగా పెరిగిన టమాటా ధరలు.. వాటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించాడు. దీంతో అతడికి ఓ ఆలోచన వచ్చింది.
అనుకున్నదే తడవుగా.. తన షాపులో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వారికి రెండు కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు ఆ దుకాణానికి వరుస కడుతున్నారు. ఈ ఆఫర్ వల్ల కస్టమర్ల సంఖ్య పెరిగిందని.. స్మార్ట్‌ఫోన్లు కూడా ఎక్కువగా అమ్ముడయ్యాయని అశోక్ సంతోషం వ్యక్తం చేశాడు.