ఈనెల 11న జరిగిన ఘటనపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులకు తాను రాతపూర్వకంగా వివరణ ఇచ్చానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన.. మహిళతో దురుసుగా ప్రవర్తించినట్టు అభియోగం నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందు ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్నది వేరు.. జరిగిన వాస్తవం వేరని చెప్పారు. కంచె తొలగింపు గటన అనుకోకుండా జరిగిందని అన్నారు. కంచె ఉన్న విషయం అక్కడికి వెళ్లే వరకు తనకు తెలియదన్నారు. తనపై ఫిర్యాదు చేసిన వాళ్లే ఇవాళ తనతో కలిసి పనిచేస్తున్నారని వెల్లడించారు. తిరువూరు ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసునని… తిరువూరు ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలని.. తాను తప్పు చేసినట్టు వాళ్లు చెబితే అంగీకరిస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే..
ఈ నెల 11న ఎ.కొండూరు మండలం గోపాలపురంలోని టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి వెళ్లారు కొలికపూడి. ఆ గ్రామంలో రాంబాబుకి, ఆయనకు వరుసకు సోదరుడయ్యే… వైసీపీ నాయకుడు భూక్యా కృష్ణకు ఎప్పటి నుంచో ఆస్తి తగాదా ఉంది. ఇటీవల గ్రామంలో సీసీ రోడ్డు వేశారు. ఆ రోడ్డు తన స్థలంలోనే వేశారని.. వివాదం తేలేవరకు రోడ్డుని ఎవరూ వినియోగంచి వద్దని కృష్ణ దానిపై కంచె వేశారు. రాంబాబు ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ రోడ్డు దగ్గరకు వెళ్లి కృష్ణ, ఆయన భార్య భూక్యా చంటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తమ ఇంట్లోకి వచ్చి తన భర్తను, తనను కొట్టారంటూ… భూక్యా చంటి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. టీడీపీ నేతలు కూడా ఎమ్మెల్యే వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో సోమవారం ఎమ్మెల్యే కొలికపూడి క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణకు కొలికపూడి వివరణ ఇచ్చారు. క్రమ శిక్షణ కమిటీ నివేదికను పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఇవ్వనున్నారు.